విజయవాడ జీజీహెచ్‌లో గుండె గోడు వినేదెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

విజయవాడ జీజీహెచ్‌లో గుండె గోడు వినేదెప్పుడు?

Mar 28 2026 7:14 AM | Updated on Mar 28 2026 7:14 AM

విజయవాడ జీజీహెచ్‌లో గుండె గోడు వినేదెప్పుడు? లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగం పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందలేక, ప్రభుత్వాస్పత్రికి వస్తే.. ‘పరీక్షలు చేసి, బైపాస్‌ సర్జరీ చేయాలి, ఇక్కడ అందుబాటులో లేదు, ఎక్కడైనా చేయించుకోండి’ అంటూ వైద్యులు ఉచిత సలహా ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా ప్రైవేటులో అదనంగా డబ్బులు వసూలు చేయడంతో.. వారు తమ పేదరికాన్ని నిందించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మూడేళ్ల కిందటే గుండె శస్త్ర చికిత్స విభాగం ఏర్పాటు చేశారు. గతంలో రెండు, మూడు సర్జరీలు సైతం చేశారు. ప్రస్తుతం దాని పరిస్థితి ఆధునిక సౌకర్యాలు అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శనిలా మారి రోగులకు సేవలు అందడం లేదు. ఆ విభాగంలో గత ప్రభుత్వ హయాంలో అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్‌, పోస్ట్‌ ఆప్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ వార్డును ఏర్పాటు చేసి, వైద్యులను నియమించారు. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు ఆ విభాగంలో పనిచేస్తున్నారు. కానీ గుండె సర్జరీలు మాత్రం జరగడం లేదు. దీంతో గుండె ఆపరేషన్‌లు అవసరమైన రోగులు దిక్కుతోచని స్థితిలో అప్పులు చేసి ప్రైవేటులో చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ ఐదో అంతస్తులో కార్డియో థోరాసిక్‌ శస్త్ర చికిత్స(గుండె ఆపరేషన్‌) విభాగం ఉంది. అక్కడ ఆధునిక ఆపరేషన్‌ థియేటర్‌తో పాటు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ కూడా ఉంది. ఈ విభాగాన్ని కోవిడ్‌కు ముందు ఏర్పాటు చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో ఎక్కువ రోజులు మూత పడి ఉండటంతో మరలా 2023లో రూ.20లక్షల వ్యయంతో థియేటర్‌ను ఆధునికీకరించారు. లామినర్‌ ఫ్లోరింగ్‌, రోగులకు ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా మాడ్యులర్స్‌ను ఏర్పాటు చేశారు. శస్త్ర చికిత్స అనంతరం రోగులను ఉంచేందుకు ఆధునిక సౌకర్యాలతో పోస్ట్‌ ఆప్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ శస్త్ర చికిత్సలు మాత్రం జరగడం లేదు. కార్డియో థోరాసిక్‌ శస్త్ర చికిత్స విభాగంలో ప్రస్తుతం ఇద్దరు వైద్యులు ఉన్నారు. వారంలో మూడు రోజులు (సోమ, బుధ, గురు) అవుట్‌పేషెంట్స్‌ సేవలు సైతం అందిస్తున్నారు. కానీ గుండె సర్జరీలు మాత్రం చేయడం లేదు. చేతి రక్తనాళాల్లో పూడికలు, కాళ్ల రక్తనాళాల్లో పూడికలు వంటి వాటికి మాత్రమే సర్జరీలు చేస్తున్నారు. ఇక్కడ గుండె ఆపరేషన్‌లు చేసేందుకు అవసరమైన సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. గుండె సర్జరీ తర్వాత రోగులకు ఎలాంటి ప్రికాషన్స్‌ తీసుకోవాలి అనే అంశాలపై ప్రస్తుతం జీజీహెచ్‌ సిబ్బందికి సరైన అవగాహన లేక పోవడంతోనే సర్జరీలు చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ప్రస్తుతం జీజీహెచ్‌ కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్‌ పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అక్కడ యాంజియోగ్రామ్‌ చేసిన తర్వాత స్టెంట్‌ అవసరమైతే అక్కడే వేస్తున్నారు. బైపాస్‌ సర్జరీ చేయాల్సి వస్తే మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడికి ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాలకు చెందిన రోగులు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన వారు, మరలా వేరొక చోటుకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు.

ఇదే నిదర్శనం..

గన్నవరానికి చెందిన 55 ఏళ్ల మహిళ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటుంది. రెండు నెలల కిందట ఆయాసం రావడంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమె యాంజియోగ్రామ్‌ చేసి మూడు బ్లాక్‌లు ఉండటంతో బైపాస్‌ చేయాలని చెప్పారు. అక్కడ అందుబాటులో లేక పోవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆరోగ్యశ్రీలో చేసినా, అదనంగా రూ.60 వేలు చెల్లించాల్సి వచ్చింది. చేతిలో రూపాయి లేక పోవడంతో అప్పు చేసి ఆస్పత్రిలో కట్టినట్లు బంధువులు చెబుతున్నారు. ఈమె ఒక్కరే కాదు అనేక మంది బైపాస్‌ సర్జరీలు అవసరమైన వారు ప్రైవేటు ఆస్పత్రు లకు వెళ్లి, సర్జరీలు చేయించుకుంటూ అక్కడ ఆరోగ్యశ్రీ అయినా రూ.40వేల నుంచి రూ.60 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాలున్నా

సర్జరీలు చేయని వైనం

ఇద్దరు వైద్యులున్నా నిరుపయోగం

వైద్యం కోసం రోగులు ప్రైవేటుకు

వెళ్లాల్సిన దయనీయ స్థితి

వైద్య రంగంపై చంద్రబాబు ప్రభుత్వ

నిర్లక్ష్యంతో పేదల అవస్థలు

అన్నీ ఉన్నా సమస్యే..

ఆధునిక సౌకర్యాలున్నా...

ప్రభుత్వ చొరవ ఏది?

ప్రైవేటుకు వెళ్లాల్సిన పరిస్థితి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement