దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

Mar 28 2026 7:14 AM | Updated on Mar 28 2026 7:14 AM

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు మోపిదేవి ఆలయంలో కియోస్క్‌ మిషన్లు ప్రారంభం అంధుల క్రికెట్‌ పోటీల్లో ఆంధ్ర జట్టు ఘన విజయం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు శుక్రవారం విరాళాలు అందించారు. విజయ వాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఎం. శివరామ ప్రసాద్‌, రమాదేవి కుటుంబ సమేతంగా ఆలయ అధికారులను కలిసి రూ.1,01,116, విజయవాడ చుట్టుగుంటకు చెందిన డాక్టర్‌ రాజీవ్‌, ప్రశాంతి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

మోపిదేవి: భక్తులకు మరింత సేవలు అందించేందుకు మూడు కియోస్క్‌ మిషన్లు అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవరప్రసాదరావు శుక్రవారం వెల్లడించారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో కరూర్‌ వైశ్యా బ్యాంకు వారు అందించిన మూడు కియోస్క్‌ మిషన్లను ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్‌ శర్మ బ్రహ్మత్వంలో శుక్రవారం ఉదయం పూజలు, హారతులు అందించి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ ఈ మిషన్ల ద్వారా భక్తులు టికెట్‌ కౌంటర్ల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించకుండా నేరుగా సేవా టికెట్లు పొందడం, ఈ–హుండీ ద్వారా విరాళాలు సమర్పించడం, దేవస్థానానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు, కరూర్‌ వైశ్యా బ్యాంకు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): అంధుల క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు మధ్యప్రదేశ్‌పై 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు రోజులుగా స్థానిక అరండల్‌పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీఏబీఏపీ), డిఫరెంట్లీ ఏబుల్డ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అంధుల క్రికెట్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంధుల క్రికెట్‌ ఇన్‌క్ల్లూజివ్‌ ఛాలెంజర్స్‌ ట్రోఫీ‘ టీ20 బైలేటరల్‌ సిరీస్‌ను ఆంధ్ర జట్టు ఏకపక్ష విజయాలతో నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో జట్టు సమష్టిగా ఆడి విజయం నమోదు చేసింది.

పోటీతత్వం భేష్‌..

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ పోటీతత్వం ముందు అంధత్వం ఓటమి చెందిందన్నారు. యువ క్రీడాకారులకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ‘దృష్టి లోపం ఉన్నా, గుండె నిండా ధైర్యంతో మైదానంలో ప్రదర్శించిన పోరాట పటిమ అద్భుతమన్నారు. అనంతరం విజేతలతో పాటు రన్నర్స్‌కు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ అంధుల మాజీ క్రికెటర్‌ అజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌బీఐ డీజీఎం. కృష్ణకుమార్‌, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణప్ప, ఏఐబీఓసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయకుమార్‌, వీసీవైఏ అధ్యక్షుడు ఎల్‌.రత్నరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement