ఊరేగింపుగా..
● పాగోలులో 70 ఏళ్ల తర్వాత
సీతారాముల కల్యాణం
● జెడ్పీటీసీ సభ్యురాలు కల్యాణి,
శివప్రసాద్ దంపతుల చొరవతో
సాధ్యమైందన్న గ్రామస్తులు
చల్లపల్లి: దాదాపు 70 ఏళ్ల తరువాత ఆ గ్రామంలో సీతారాముల కల్యాణం శుక్రవారం కనుల పండువగా జరిగింది. సాధారణంగా రామాలయం లేని ఊరు ఉండదంటారు. కానీ ఇక్కడ ఆలయం ఉన్నా ఇప్పటి వరకూ ఎటువంటి ఉత్సవాలకు నోచుకోకపోవడం గమనార్హం. అదే చల్లపల్లి మండల పరిధిలోని పాగోలు పంచాయతీ శివారు మేకావారిపాలెంలోని శ్రీసీతారామ లక్ష్మణ సమేత అభయాంజనేయస్వామి ఆలయం.
అసలు ఏమైందంటే..
దాదాపు 70 ఏళ్ల క్రితం గ్రామంలో జరిగిన గొడవల కారణంగా అప్పటి నుంచి ఆ ఆలయంలో నవమి వేడుకలు గానీ, ఉత్సవాలు గానీ నిర్వహించలేదు. చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, ఆమె భర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజులపాటి శివప్రసాద్ దంపతులు కొన్ని రోజుల క్రితం మేకావారిపాలెం వెళ్లి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో విగ్రహాలు లేకుండా ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఊర్లోని పెద్దవారిని ఆరా తీయగా.. ఏడు దశాబ్దాలుగా ఆ ఆలయంలో ఎటువంటి పూజలు జరగటంలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. విషయం తెలిసిందే తడవుగా వారు వెంటనే గ్రామస్తులతో మాట్లాడటంతో రూ.30వేల వరకూ విరాళాలు వచ్చాయి. వారు సొంతంగా మరో రూ. లక్ష సమకూర్చి ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించారు. కల్యాణి, శివప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఆలయానికి కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని వైభవంగా కల్యాణ వేడుకలు జరిపించారు.
తొలుత సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలతో కల్యాణి దంపతులు వారి ఇంటి నుంచి నడుచుకుంటూ ఆలయం వరకూ ఊరేగింపుగా వచ్చి, గ్రామంలోని మరికొందరు దంపతులతో కలిసి పీటలపై కూర్చొని పూజలు జరిపించారు. చాలా ఏళ్ల తరువాత తమ గ్రామంలోని ఆలయంలో జరుగుతున్న సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై తరించారు. జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, శివప్రసాద్ దంపతులను, ఇతర దాతలను, కమిటీ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.


