రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(డబ్ల్యూడబ్ల్యూఓ) మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వందన శ్రీవాస్తవ అన్నారు. గురువారం విజయవాడ డివిజన్‌లో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియాతో కలసి వందన శ్రీవాస్తవ ముందుగా పునరుద్ధరించిన జాక్ అండ్ జిల్ స్కూల్‌ను ప్రారంభించారు. అనంతరం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినుల్లో ఆత్మగౌరవం పెంచేలా శానిటరీ డిస్పోజల్ యూనిట్‌ను ఆమె ప్రారంభించారు. అదే విధంగా డివిజన్‌లోని పలు కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు మరో 14 శానిటరీ డిస్పోజల్ యూనిట్‌లను డివిజన్ ఆర్గనైజేషన్‌కు అందజేశారు.
డివిజన్‌కే గర్వకారణం..
ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియా మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న పరివర్తన డివిజన్‌కే గర్వకారణం అన్నారు. పాఠశాల పునరుద్ధరణ, ఆధునిక పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన విద్యార్థులు, సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొండా వీణా చందన, సెక్రటరీ నిహారిక, స్కూల్ సెక్రటరీ ఆర్.పవిత్ర, వి.సింధూర లక్ష్మి పాల్గొన్నారు.


