మూలపాడు(ఇబ్రహీంపట్నం): జిల్లాలో సమగ్ర పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఎకో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మండలంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్కు నగరవనాన్ని గురువారం ఆయన సందర్శించారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పార్కును పరిశీలించి అభివృద్ధి ప్రణాళికలపై అటవీ శాఖ అధికారులతో చర్చించారు. జిప్‌లైన్ కార్యకలాపాలు, ప్రధాన నడక దారి, ట్రెక్కింగ్ మార్గం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎకో టూరిజం అనేది ప్రకృతి సంరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రకృతి ప్రేమికులకు సీతాకోక చిలుకుల సోయగాలతో మధురానుభూతులు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, సైక్లింగ్ ట్రాక్, యోగా సెంటర్, వాటర్ ఫౌంటైన్, రెస్ట్ రూమ్స్‌తో పాటు తాగునీటిని అందిస్తామని వెల్లడించారు. అటవీ శాఖ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


