మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల వడోదరలో జరిగిన అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్‌ఐ) వార్షిక సర్వసభ్య సమావేశంలో కబడ్డీ అభివృద్ధికి శ్రీకాంత్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్‌గా నామినేట్ చేస్తూ ఏకేఎప్‌ఐ ప్రతినిధులు నియమకపత్రం అందజేశారని తెలిపారు. శ్రీకాంత్‌కు ఆంధప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కల అర్జునరావు, సంయుక్త కార్యదర్శి కె.వి.నాంచారయ్య, కోశాధికారి ఎం.సుబ్బరాజు తదితరులు అభినందనలు తెలిపారు.
వేదాద్రి(జగ్గయ్యపేట): స్థానిక యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు హుండీల్లో సమ ర్పించిన కానుకల ద్వారా రూ.14.58 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ సురేష్‌బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ కానుకలు లెక్కించారు. మూడు నెలల 21 రోజులకు ఈ ఆదాయం వచ్చింది. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పవన్‌కల్యాణ్, కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది. ఈ మేరకు యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రావి వెంకట్రావు బుధవారం మాట్లాడారు. 2007లో ఎన్‌ఆర్‌ఐ ఫార్మసీ, 2008లో ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించగా, 2018లో అటానమస్ హోదా లభించిందన్నారు. ఇప్పటివరకు అనేకమంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా ప్రమాణాలందించి, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు కల్పించామని వివరించారు. డీమ్డ్ యూనివర్సిటీ ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పెనమలూరు: గంగూరులో యూనియన్ పెట్రోల్ బంక్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఉయ్యూరు మండలం పెదఓగిరాలకు చెందిన ముగ్గురు యువకులు యూనియన్ పెట్రోల్ బంక్‌కు బైక్‌పైవచ్చారు. పెట్రోల్ పోసిన తరువాత సొమ్ము చెల్లించే విషయంలో బంక్ సిబ్బందితో వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఆ ముగ్గురు సిబ్బందిపై దాడికి దిగి గాయపరిచారు. అంతటితో ఆగకుండా బంక్ ఫర్నిచర్, అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోల్ పోయించుకోవటానికి వచ్చిన వాహనదారులు బెంబేలెత్తారు. కొద్ది సమయం యువకులు రెచ్చిపోయిన తరువాత తేరుకున్న బంక్ సిబ్బంది, స్థానికులు తిరగబడటంతో ఇద్దరు యువకులు పారిపోగా ఒక యువకుడు దొరికాడు. పోలీసులకు సమాచారం ఇవ్వ టంతో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


