కృష్ణలంక(విజయవాడతూర్పు): సంపూర్ణ పేదరిక నిర్మూలన జరగాలంటే పేదలకు భూ పంపిణీ ఒక్కటే మార్గమని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు గుంటూరు బాపనయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బా రావు అధ్యక్షతన వలస కార్మికులకు రక్షణ చట్టం చేయాలని, 2005 ఉపాధి హామీ చట్టం అమలని కోరుతూ సెమినార్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు ఊదర కొడుతున్నా రని, ఎక్కడ, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళలో వామపక్షపాలనలో భూ సంస్కరణలు అమలు జరగడం వల్లే దేశంలోనే అక్షరాస్యత, పేదరిక నిర్మూలనలో ఆ రాష్ట్రం ముందుందని వివరించారు. వ్యవసాయ కార్మికులకు రక్షణ చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ అని గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్‌డీఏ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేసిందని, ఫలితంగా వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో కూలీలకు 25.54 కోట్ల పనిదినాలు కల్పించి రూ.2500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చు చేసి కేవలం 18 కోట్ల పనిదినాలు కల్పించారని వివరించారు. గతంలో కుటుంబం సగటున 55 రోజులు పని చేస్తే ఇప్పుడు 42 రోజులకు పడిపోయిందన్నారు. రాష్ట్రంలో 200 మందికి పైగా వలస కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతికుటుంబానికి 200 రోజల ఉపాధి హామీ పని కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సెమినార్‌లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి, వ్యవసాయ సంఘం రాష్ట్ర నాయకులు కోట కళ్యాణ్, అప్పారావు, పిల్లి రామకృష్ణ, రవి, ఆంజనేయులు, కోటేశ్వరి పాల్గొన్నారు.


