పెడన: ఇంటి స్థలాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి స్వామిత్వ సర్వే ప్రక్రియపై కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బుధవారం పునఃపరిశీలన చేశారు. పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సచివాలయంలో స్వామిత్వ సర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన గ్రామ మ్యాపులు, రికార్డులను పరిశీలించడమే కాకుండా ల్యాప్‌టాప్‌లో వివరాలను పరిశీలించారు. కొన్ని విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి పన్నుల వసూలు తీరును తనిఖీచేశారు. ఏ విధంగా వసూళ్లు చేస్తున్నది పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మీడియాతో మాట్లాడారు. స్వామిత్వ సర్వే ఎలా జరి గిందో పరిశీలించామన్నారు. కొన్ని అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిష్కరించి సంబంధిత యాజమానులకు ప్రాపర్టీ కార్డులు అందజేస్తామన్నారు. రీసర్వేకు సంబంధించి ఆగ్రికల్చరల్ ల్యాండ్స్‌పై సర్వేను కూడా నందిగామలో పరిశీలించామని తెలిపారు. పెనుమల్లి గ్రామంలో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, చాలా మంది మోటర్లు ద్వారా మంచి నీటిని తోడేసుకుంటు న్నారని కలెక్టర్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి తాగునీటిని తోడే మోటార్లను పంచాయతీ కార్యాలయానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వే ఏడీ పి.లక్ష్మణరావు డీడీఓ జి.పద్మ, డీఎల్‌డీక్ష రాజావుల్లా, ఇన్‌చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్, ఎంపీడీఓ ఎ.అరుణ కుమారి, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, సర్పంచ్ గరికపాటి వెంకటరామానాయుడు, తదితరులు పాల్గొన్నారు. పెనుమల్లిలో పర్యటన సందర్భంగా తొమ్మిది నుంచి పదో తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వేసవి సెలవుల్లో సబ్జెక్టులపై పట్టు సాధించాలని సూచించారు. ఎంఈఓ–1, 2 ఎన్.సలోమి, హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.


