తన భర్త మృతికి వారే కారణమంటూ ఆరోపిస్తూ మహిళ ఆందోళన
గన్నవరం: తన భర్త పడమట నాగరాజు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన గన్నవరం సీఐ, కానిస్టేబుళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పడమట వీరాకుమారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పడమట నాగరాజు అంతిమయాత్రలో భాగంగా అతని కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరాకుమారి మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ సెటిల్‌మెంట్ విషయమై ఈ నెల 19న పోలీసులు నాగరాజును ఈ స్టేషన్‌కు పిలిపించారని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో నాగరాజు బాధ్యుడిని చేసి రూ. 5 లక్షలు కట్టమన్నారని, లేకపోతే పాత కేసులు తిరగదోడి ఇబ్బందులకు గురిచేస్తామని సీఐ, కానిస్టేబుళ్లు బెదిరించినట్లుగా తెలిపారు. ఆయన సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు లాక్కొన్నారని చెప్పారు. అవమానభారంతో స్టేషన్ నుంచి వెళ్లిన నాగరాజు తిరిగి ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురై తన ఇరువురు కుమారైలతో కలిసి ఈ నెల 20వ తేదీ రాత్రి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు చెప్పారు. మహిళననే కనీస గౌరవం లేకుండా సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది కించపరుస్తూ మాట్లాడటంతో పాటు నీ భర్త డబ్బులు తీసుకురాకపోతే పిల్లలతో సహా తనను స్టేషన్‌లో కూర్చోబెడతానని బెదిరింపులకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తన కులాన్ని కూడా అవహేళన చేస్తూ సీఐ మాట్లాడారని చెప్పారు. తన విజ్ఞప్తిపై పోలీసులు స్పందించి తన భర్త ఆచూకీని గుర్తించి ఉంటే బతికి ఉండేవారని తెలిపారు. తన భర్త మృతికి ముమ్మాటికీ సీఐ, కానిస్టేబుళ్లే కారణమని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే వంశీ నివాళులు..
తొలుత స్థానిక గాజులపేటలోని నివాసం వద్ద పడమట నాగరాజు భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్, ఎంపీపీ అనగాని రవి, పలువురు గౌడ సంఘ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
సీఐ ప్రవర్తనే కారణం..
గన్నవరం: పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పండ్ల వ్యాపారి పడమట నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని గన్నవరం నియోజకవర్గ గౌడ సంఘ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక గాజులపేటలోని నాగరాజు నివాసం వద్ద ఆదివారం గౌడ సంఘ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనగాని రవి మాట్లాడుతూ ఎటువంటి ఫిర్యాదు లేకుండానే ఓ ప్రైవేట్ సెటిల్‌మెంట్ వ్యవహారంలో నాగరాజును స్టేషన్‌కు పిలిపించి రూ. 5 లక్షలు కట్టమని సీఐ, కానిస్టేబుల్స్ బెదిరించారని చెప్పారు. వీరి వేధింపులు తాళలేక నాగరాజు ఆత్మహత్యయత్నానికి పాల్పడి గుంటూరులోని ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకుని హడవుడిగా నాగరాజుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అంతకు ముందు రోజు భర్త ఆచూకీ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన నాగరాజు భార్య, పిల్లల పట్ల సీఐ, ఎస్‌ఐలు అమర్యాదగా మాట్లాడడంతో పాటు గౌడ కులస్తులు పొగరుబోతులంటూ సీఐ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం కారణంగా గౌడ సంఘానికి చెందిన పలగాని శివాజీ పెద్ద కుమారుడు ప్రణయ్ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారని తెలిపారు. ఈ వరుస సంఘటనలపై డీఎస్పీ, ఎస్పీ దృష్టి సారించాలని చెప్పారు. గౌడ సంఘ నేతలు మరీదు రాంబాబు, ఎస్‌ఎస్. గౌడ్, మోదుగుమూడి వెంకటేశ్వరరావు, లుక్కా ప్రసాద్, హరిష్, మోదుగుమూడి రాజేశ్వరి, మృతుడు నాగరాజు భార్య వీరాకుమారి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


