తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

Mar 23 2026 9:15 AM | Updated on Mar 23 2026 9:15 AM

తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ‘భువన విజయం’ సాహితీ సమ్మోహనం నేటి నుంచి పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు పిడుగుపాటుకు యువకుడు మృతి

పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేదదీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో వాహనాల రద్దీ కొనసాగింది.

విజయవాడ కల్చరల్‌: పరాభవనామ ఉగాది వేడుకల సందర్భంగా శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో జీవీఆర్‌ సంగీత కళాశాలలో ఆదివారం నిర్వహించిన భువన విజయం సాహితీ రూపకం సాహిత్య పరిమణాలు వెదజల్లింది. సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం స్ఫూర్తితో నిర్వహించిన సాంస్కృతిక రూపకం పూర్తిగా విజయవంతమైంది. శ్రీ కృష్ణదేవరాయలుగా కేతవరపు శివరామకుమార్‌, మహామంత్రి తిమ్మరసుగా ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారయణ మూర్తి, అల్లసాని పెద్దగా డాక్టర్‌ కడిమెళ్ల వరప్రసాద్‌, నంది తిమ్మనగా దండిభట్ల దత్తాత్రేయ శర్మ, మాదయగారి మల్లనగా డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, పింగళి సూరనగా డాక్టర్‌ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, భట్టుమూర్తిగా పోవూరి గౌరీనాథ్‌, అయ్యలరాజు రామభద్రునిగా కుందా విజయరామశర్మ, ధూర్జటిగా కోట వెంకట లక్ష్మీనరసింహం, తెనాలి రామ కృష్ణుడిగా మల్లాప్రగడ నందకిషోర్‌, బాల కవిగా మల్లాప్రగడ అభిరాం తమ సాహిత్య గ్రంథ విశేషాలను వివరించారు. శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్‌ ప్రకాష్‌, సంగీత కళాకారులు గాయత్రీ గౌరీనాథ్‌, చారుమతీ పల్లవితోపాటు పలువురు భాషా పండితులు పాల్గొన్నారు.

రేపల్లె: రేపల్లె పట్టణ గ్రామదేవత బూరగలమ్మ అమ్మవారి పుష్కర కుంభాభిషేక మహోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ మహాకుంభాభి షేక మహోత్సవం సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకుడు నందివెలుగు భానుసుధాకర్‌ గురుకులు ఆదివారం తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకమారు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయని దీనిలో భాగంగా విశేష పూజలతోపాటు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 25వ తేదీ ఉదయం 9.50 గంటలకు ఆలయ శిఖరానికి, అమ్మవారికి ఏకకాలంలో అభిషేకం జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మహాకుంభాభిషేక మహోత్సవం జయప్రదం చేయాలని కోరారు.

అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్‌ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివానతోపాటు పిడుగు పడటంతో విజయ్‌కుమార్‌(25) అక్కడికక్కడే మృతి చెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్‌ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్‌ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహన్ని అమరావతి సీహెచ్‌సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement