నందిగామ టౌన్: నందిగామలో నూతనంగా ఏర్పాటవుతున్న కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతికి అడ్మిషన్‌లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ రెండులోగా https://admission.kvs.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అదే విధంగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆఫ్‌లైన్ ద్వారా ఏప్రిల్ రెండు లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ కేవీఎస్ సంగటన్ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఐదో అంతస్తులో దుకాణదారులకు ఈవో హెచ్చరిక
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పూజా సామగ్రి, కొబ్బరికాయలను నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేసినా, భక్తులు నడిచే దారిని ఆక్రమించినా వెంటనే లీజ్ రద్దు చేస్తామని దుర్గగుడి ఈవో శీనానాయక్ దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మహామండపం ఐదో అంతస్తులో పూజా సామగ్రి షాపింగ్ కాంప్లెక్స్‌ను ఈవో, దేవస్థాన అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. దుకాణదారులకు కేటాయించిన స్థలం కంటే అదనంగా స్థలాలను ఆక్రమిస్తున్నారని, తద్వారా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపున నిర్ణీత ధరల కంటే అధికంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఆర్‌టీజీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని ఏఈవో ఎన్. రమేష్‌బాబును ఆదేశించారు. ఈవో వెంట ఈఈ ఎల్.రమా, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ధ్వంసమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2గంటల సమయంలో గుంటూరు నుంచి ఓ వ్యాన్ కృష్ణాజిల్లాలోని ఉయ్యూరుకు వెళ్తోంది. ఆ వాహనం స్క్రూబ్రిడ్జి దాటి బెంజిసర్కిల్ సమీపానికి చేరుకోగానే వ్యాన్ డ్రైవర్ వేగాన్ని తగ్గించాడు. దాని వెనకాలే మచిలీపట్నం వెళ్తున్న ఒక కారు డ్రైవర్ ముందు వ్యాన్‌ను గమనించి వెంటనే కారు ఆపాడు. ఆ సమయంలో స్క్రూబ్రిడ్జి నుంచి బెంజిసర్కిల్ వైపునకు అతివేగంగా వెళ్తున్న మరో కారు ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆగి ఉన్న కారు కొంచెం దూరం ముందుకు కదిలి ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టి రెండు వాహనాల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో కారు ముందు, వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వెనుకవైపు కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండి కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


