కార్తికేయుని ఆలయంలో భక్తుల కోలాహలం | - | Sakshi
Sakshi News home page

కార్తికేయుని ఆలయంలో భక్తుల కోలాహలం

Mar 23 2026 9:15 AM | Updated on Mar 23 2026 9:15 AM

కార్తికేయుని ఆలయంలో భక్తుల కోలాహలం బకింగ్‌హామ్‌ కెనాల్‌లో దూకి వృద్ధుడు మృతి ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగ పుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరిటెండెంట్‌ అచ్యుత మదుసూధనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే వివిధ సేవా టికెట్ల ద్వారా స్వామి వారికి రూ. 8,35,885 ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిఽధిలోని బకింగ్‌హామ్‌ కెనాల్‌ ఉండవల్లి సెంటర్‌ బ్రిడ్జి పైనుంచి ఆదివారం ఓ వృద్ధుడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సాయికుమార్‌ సంఘటనా స్థలానికి వచ్చి నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీయించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కొట్టు సెంటర్‌ ప్రాంతంలో నివాసముండే ధనేకుల అర్జునరావు (68)గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అర్జునరావు ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. జరిగిన సంఘటనపై భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాయికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకే సమయంలో ప్రాణం పోయి ఉంటుందని అందువల్లే మృతదేహం నీటిపై తేలియాడిందని ఎస్‌ఐ తెలిపారు.

ఇరువురికి స్వల్ప గాయాలు

నందిగామ రూరల్‌: ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్‌ ఇంజిన్‌ రెండు ముక్కలైన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని ఐతవరం గ్రామ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్‌ కిరాయిబాబుకు చెందిన ట్రాక్టర్‌ ఇంజిన్‌ రెండు భాగాలుగా విడిపోయింది. కాగా కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్‌ నాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement