తిరుపతమ్మ కల్యాణానికి సర్వం సిద్ధం
నేటి నుంచి పెనుగంచిప్రోలులో పెద్ద తిరునాళ్లు
పెనుగంచిప్రోలు: రాష్ట్ర ప్రజలతో విశేష పూజలందుకుంటున్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి ప్రథమ(పెద్ద) తిరునాళ్లకు అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే తిరునాళ్లకు విచ్చేసే వేలాదిమంది భక్తుల సౌకర్యార్ధం ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్‌బాబు, ఈఈ ఎల్.రమాదేవి నిత్య పర్యవేక్షణ జరుపుతూ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఆదివారం రాత్రి జరిగే అమ్మవారి కల్యాణానికి భారీ కల్యాణ వేదికను తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులతో ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు దూరం నుంచి చూసేందుకు వీలుగా కల్యాణ మండపం వద్ద, గ్రామంలో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయటంతో పాటు టీవీ చానల్ ద్వారా రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. ఆలయం చుట్టూ 15 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవం పలు జిల్లాల ప్రజలకు తెలిసే విధంగా ఇబ్రహీంపట్నం, ఖమ్మం జిల్లా బోనకల్లు, చిల్లకల్లు, ముండ్లపాడు, మక్కపేట క్రాస్‌రోడ్స్ వద్ద, జాతీయ రహదారిపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 1 న, మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం రాత్రి 9 గంటల 5 నిమిషాలకు శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి కల్యాణం జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. కల్యాణం రోజు ఉదయం నుంచి దీక్షా స్వాములు తిరుముడి సమర్పిస్తారని, ఫిబ్రవరి 2 న మధ్యాహ్నం జలబిందెలు, 3 న ఉదయం ఉదయపొంగళ్లు, అంకమ్మసేవ, 4న దీవెన బండారు, బోనాలు, ఫిబ్రవరి 5 న పూర్ణాహుతితో పెద్ద తిరునాళ్లు ముగుస్తాయని ఈవో తెలిపారు.


