ఈతకు వెళ్లి బాలుడి గల్లంతు
కృష్ణలంక(విజయవాడతూర్పు): సరదాగా ఈతకు వెళ్లి ఓ బాలుడు కృష్ణానదిలో గల్లంతైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పాయకాపురం, న్యూరాజీవ్‌నగర్‌కు చెందిన పొనగంటి ఈశ్వరరావు కుమారుడు గణేష్ మణికంఠ (14) అదే ప్రాంతంలోని రాజీవ్ గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం నుంచి స్కూల్‌కు సెలవు కావడంతో మణికంఠ, అదే ప్రాంతానికి చెందిన తన ఐదుగురు స్నేహితులు కృష్ణానదిలో ఈత కొట్టేందుకు మూడు సైకిళ్లపై కృష్ణ్ణవేణి ఘాట్ వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శనైశ్వరస్వామి స్వామి గుడి వెనుక వైపు కృష్ణానదిలోకి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్లి ఆరుగురూ నీటిలోకి దిగారు. మణికంఠ నదిలో ఈత కొడుతూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి మునిగిపోయాడు. దీంతో మిగిలిన ఐదుగురు భయపడి బయటకు వచ్చి పెద్దగా కేకలు వేశారు. స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిపడేంతవరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. మణికంఠ నదిలో గల్లంతయ్యాడన్నా విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో ఓ యువకుడు ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహం శనివారం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు కాలువ కట్టపై కూనపరెడ్డి బుజ్జిబాబు, అంజలి దంపతులు నివసిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు మహేష్ (24) ఉడ్ వర్కు కార్మికుడు, రెండో కుమారుడు రాకేష్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ నెల 23వ తేదీ ఉదయం మహేష్ తల్లిదండ్రులతో కలిసి ద్విచక్రవాహనంపై పనిమీద బయటకు బయలు దేరాడు. ఏలూరు కాలువ వంతెన వద్దకు రాగానే కాలి చెప్పు పడిపోయిందని చెప్పి ద్విచక్రవాహనంపై నుంచి దిగాడు. ఒక్కసారిగా వంతెనపై నుంచి కాలువలోకి దూకేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో బుజ్జిబాబు, అంజలి దంపతులు తల్లడిల్లారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు సమాచారం అందించగా, వారు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం పడవ సాయంతో గాలించగా వంతెనకు కొద్దిదూరంలో మహేష్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ ఆత్మహత్యకు గలకారణాలు తెలియాల్సి ఉంది.
ఈతకు వెళ్లి బాలుడి గల్లంతు


