26 నుంచి ఆహ్వాన నాటకోత్సవాలు
విజయవాడ కల్చరల్: డాక్టర్ నందమూరి తారక రామారావు కళాపరిషత్, తపస్వి కల్చరల్ ఆర్ట్స్, ఆంధ్రనాటక కళాసమితి, కొడాలి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏపీ సృజనాత్మక సమితి సౌజన్యంతో ఈ నెల 26 నుంచి మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలను హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు కళాసమితి అధ్యక్షుడు ఎన్. నాగేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. తొమ్మిదేళ్లుగా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తపస్వి కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు సూర్యదేవర జగన్నాథరావు మాట్లాడుతూ 26వ తేదీ దీపం కింద చీకటి, నువ్వో సగం నేనో సగం నాటకాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. నాటక రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివ రావుకు తపస్వి కళాసేవా పురస్కారం ప్రదానం చేస్తారని తెలిపారు. 27వ తేదీ కన్నీటికి విలువెంత, వాస్తవం నాటకాలు, రచయిత వల్లూరి శివప్రసాద్‌కు తపస్వి కళాసేవా పురస్కారం 28వ తేదీ దేవుడిని చూశా, నిశి నాటకాల ప్రదర్శన, ఏపీ జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్‌ఆర్ కృష్ణబాబుకు కర్నాటి రామ్మోనరావు స్మారక పురస్కారం ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో తపస్వి కల్చరల్ ఆర్ట్స్ ఉపాధ్యడు డాక్టర్ దొంతాల ప్రకాష్, నాటక రచయిత, నటుడు వేమూరి నాగేశ్వర శర్మ, సంస్థ కోశాధికారి బాయన శ్రీనివాసరావు పాల్గొన్నారు. నాటకోత్సవాల పోస్టర్‌ను అతిథులు ఆవిష్కరించారు.
నేటి నుంచి హంసలదీవిలో భాగవత సప్తాహం
కోడూరు: హంసలదీవి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం నుంచి భాగవత సప్తాహాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మాధికారి, టీటీడీ వేదపాఠశాల స్పెషల్ గ్రేడ్ ప్రిన్సిపాల్ కుప్పా సుబ్రహ్మణ్య అవధాని శుక్రవారం తెలిపారు. అనంతవరానికి చెందిన కుప్పా వంశీయుల ఆధ్వర్యంలో 104 సంవత్సరాల నుంచి మాఘ మాసంలో భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం ప్రారంభించి, వారం రోజులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న హంసలదీవి గ్రామస్తుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అవధాని పేర్కొన్నారు.
అమ్మవారి కల్యాణానికి తలంబ్రాలు
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ ఆలయంలో శుక్రవారం కల్యాణ తలంబ్రాలు కలిపే కార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 1న జరిగే గోపయ్య సమేత తిరుపతమ్మ కల్యాణం అనంతరం భక్తులకు అందించడానికి తలంబ్రాలను కలిపించారు. గ్రామంలోని రంగుల మండపం వద్ద నుంచి ఆలయం వరకు భక్తులు గోటితో వలిచిన బియ్యాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. వీటిలో కల్యాణ తలంబ్రాలను కలిపి వేదిక వద్ద నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి కల్యాణం అనంతరం భక్తులందరికీ పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
26 నుంచి ఆహ్వాన నాటకోత్సవాలు
26 నుంచి ఆహ్వాన నాటకోత్సవాలు


