ఇబ్రహీంపట్నంలో జోగి బ్రదర్స్‌కు ఘన స్వాగతం
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్, రాము సోదరులకు ఇబ్రహీంపట్నంలో భారీ స్వాగతం లభించింది. భవానీపురం స్టేషన్‌లో నమోదైన కేసులో ఇప్పటికే బెయిల్ రాగా, తాజాగా ములకలచెరువు కేసులో కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు బాణ సంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇంటి వరకు జరిగిన ర్యాలీలో దారిపొడవునా స్థానికులు, నాయకులు పాల్గొని స్వాగతం పలికారు. పోలీసులు బాణసంచా కాల్చకుండా అడ్డుకున్నారు. జోగి రమేష్ కారుతో పాటు వచ్చిన మరో రెండు కార్లకు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. జోగి రమేష్ భార్య జోగి శకుంతలమ్మ, కుమారులు, ఆయన తండ్రి జోగి మోహనరావు బంధువులు ఆలింగనం చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.
జోగి రమేష్‌ను కలిసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును వారి ఇంటి వద్ద వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అవినాష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రశ్నించినందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారన్నారు. రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ఆ రోజే చెప్పామని గుర్తు చేశారు. మిధున్‌రెడ్డిని అరెస్ట్ చేసినా, రమేష్‌ను అరెస్ట్ చేసినా ఎవరూ భయపడలేదన్నారు. అరెస్ట్‌లకు కార్యకర్తలెవరూ భయపడరని చెప్పారు. అరుణకుమార్ మాట్లాడుతూ చేయని తప్పులకు జోగి రమేష్‌ను జైలుల్లో పెట్టారన్నారు. ఆయన ఎంత ధైర్యంగా లోపలకు వెళ్లారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారని, ఇక నుంచి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పాలనపై పోరాటం చేస్తారన్నారు. మా నాయకులను ఇబ్బంది పెట్టిన వారిపై 2029లో చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు.


