వృక్ష విలాపం
భారీగా తరలింపు
వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేయాలి
వెల్లటూరు వద్ద రహదారికి ఇరువైపులా చెట్లను నరికి తరలిస్తున్న కూలీలు (ఫైల్)
జి.కొండూరు: మొక్కలను కాపాడితే అవి మనల్ని కాపాడతాయని నానుడి. అయితే కొందరు అక్రమార్కుల పాపం.. వృక్ష విలాపంగా మారుతోంది. అటవీ శివారు గ్రామాల్లో కొందరు కలప అక్రమ రవాణాను వ్యాపారంగా మార్చుకోవడంతో పగటి వేళ అడవిలో చెట్లను నరికేస్తున్నారు. సెలవు రోజుల్లో, రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో కలపను రవాణా చేస్తున్నారు. కలపను ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రహదారుల వెంట చెట్లను సైతం వదలడం లేదు.
టన్ను రూ.3 వేలకు విక్రయం
జిల్లాలో పలుచోట్ల అడవిలో నరికిన కలపను ఇటుక బట్టీలకు తరలించి టన్ను రూ.2500 నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ ఒక్కొక్క బ్యాచ్ కలప దొంగలు ఒక ట్రాక్టరు ట్రక్కు అంటే 10 టన్నుల వరకు కలపను మిషన్‌లతో ముక్కలుగా చేసి తరలిస్తున్నట్లు సమాచారం. పెద్ద తుమ్మ చెట్లు వంటి వాటిని నరికినప్పుడు ఈ కలపను డింబర్ డిపోలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గంతో, పలుప్రాంతాల్లో ఇటుక బట్టీలు అధికంగా ఉండటంతో కలపకు డిమాండ్ పెరిగి కలప దొంగలకు వరంగా మారింది.
రోడ్ల వెంట చెట్లనూ వదలరు
రహదారుల వెంట ఉన్న చెట్లను సైతం కలప దొంగలు వదలడంలేదు. సాక్షాత్తూ విద్యుత్‌శాఖ అధికారులే ఆర్‌అండ్‌బీ అధికారుల అనుమతి లేకుండా విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయనే నెపంతో చెట్లను నరికించి కలప వ్యాపారులకు విక్రయించిన ఘటనలూ ఇటీవల వెలుగులోకి వచ్చాయి. జి.కొండూరు నుంచి ఆత్కూరు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయని నరికించి ప్రయివేటు వ్యక్తులకు విక్రయించారని విద్యుత్‌శాఖ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్ అండ్ బీ అధికారుల ఫిర్యాదు మేరకు జి.కొండూరు పీఎస్‌లో కేసు కూడా నమోదైంది. గతేడాది బుడమేరుకు వరదలు వచ్చినప్పుడు జి.కొండూరు నుంచి కందులపాడు వరకు కేజీవై రహదారి, వెలగలేరు నుంచి గణపవరం వరకు ఉన్న విజయవాడ–విసన్నపేట రహదారికి ఇరువైపులా వంగిపోయిన తుమ్మ, నిద్రగన్నేరు, నేరేడు చెట్లతో పాటు నిలబడి ఉన్న చెట్లను సైతం విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయనే సాకుతో ఆర్ అండ్‌బీ అధికారుల అనుమతి లేకుండా దశల వారీగా నరికి తరలించారు. ఇదే అవకాశంగా కలపదొంగలు రహదారుల వెంబడి ఉన్న చెట్లను నరికి తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వాహన చోదకులను విద్యుత్ తీగలకు అడ్డు రాకుండా నరుకుతున్నామంటూ బుకాయిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 39 వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. సమీప గ్రామాల్లో చెట్లను కోత మిషన్‌లతో ముక్కలుగా కట్ చేసి ఇటుక బట్టీలతో పాటు టింబర్ డిపోలకు సైతం తరలిస్తున్నారు. అడవిలో లభించే నిద్రగన్నేరు, నరలేగి, రేగి, తుమ్మ, వేప, నల్లతుమ్మ వంటి చెట్లను కలప దొంగలు ఎక్కువగా నరికి తరలిస్తున్నారు. ఈ కలప దృఢంగా ఉండి ఇటుక బట్టీల్లో ఎక్కువ సమయం మండే స్వభావం ఉంటుందని ఈ చెట్లనే ఎక్కువగా నరుకుతున్నారు.
గంగినేని వైపు నుంచి ప్రతి రోజూ కలప ట్రాక్టర్లు వెళ్తున్నాయి. అడవిలో చెట్లను అక్రమంగా నరికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అనుమతులు లేకుండా రహదారుల వెంట చెట్లను నరికివేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి కలప దొంగలపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేయాలి. కలప అక్రమ రవాణాని అడ్డుకోవాలి.
–బట్టపర్తి రాజు, గ్రామస్తుడు, జి.కొండూరు
వృక్ష విలాపం


