అక్కినేని వజ్రోత్సవ వైభవం
గుడివాడ విద్యా రంగానికి పెన్నిధి ఏఎన్నార్ కళాశాల నేటి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవాలు
గుడివాడరూరల్: గుడివాడలో విద్యా రంగానికి పెన్నిధి అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) కళాశాల నిలిచింది. మొదటి 1950లో గుడివాడ కళాశాలగా ప్రారంభమై నేడు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెంది 75 ఏళ్లు (వజ్రోత్సవాన్ని) పూర్తి చేసుకోనుంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కళాశాల వజ్రోత్సవాలు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం వజ్రోత్సవ కమిటీని ఏర్పాటు చేసి గత నెలరోజులుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకల్లో స్వర్గీయ అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు భారీగా హాజరు కానున్నారు.
కళాశాల ఏర్పాట్లు బీజం పడింది ఇలా..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కృష్ణా డెల్టాలోని రైతుబిడ్డలు స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా, ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వారికి డిగ్రీ కోర్సులను అందుబాటుకి తీసుకురావాలన్న సంకల్పంతో 1950లో గుడివాడలో కళాశాలకు పునాది పడింది. విశాఖపట్నంలోని యూనివర్సిటీ వారిని అప్పటి ప్రముఖులు కలసి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత గుడివాడ, కై కలూరు, గన్నవరం ప్రాంతాల్లోని ప్రముఖులతో 1950 ఏప్రిల్ 22వ తేదీన శ్రీనివాస సినిమా హాల్‌లో సమావేశం నిర్వహించారు. పర్వతనేని వెంకటరత్నం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కాజ వెంకట్రామయ్య, సంయుక్త కార్యదర్శిగా వేములపల్లి రామబ్రహ్మం, కోశాధికారిగా ఉప్పలపాటి వీరభద్రరావు, సభ్యులుగా వడ్డే శోభనాద్రి, లింగం వెంకటకృష్ణయ్య, ఉపద్రష్ట పాపన్నశాస్త్రిలతో గుడివాడ కళాశాల ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పాటైంది. 1959లో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వారి మిత్రులు రూ.లక్ష కళాశాలకు విరాళంగా ఇవ్వడంతో అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెందింది. ల్రైబరీతో పాటు మెయిన్ బిల్డింగ్‌ను ఏర్పాటు చేయించి నిర్వహణ ప్రారంభించారు. 1961లో ముదినేపల్లికి చెందిన యెర్నేని వెంకటేశ్వరరావు రూ.54 వేలు విరాళం ఇవ్వగా ఆయన తండ్రి పేరు యెర్నేని చలమయ్య ఆడిటోరియం నిర్మించారు. కాలానుగుణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి కళాశాలకు కావాల్సిన అన్ని రంగాలు, అభివృద్ధి పనులు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం వల్ల నేడు ఏఎన్నార్ కళాశాల 75సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది.
వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ విద్య
వచ్చే ఏడాది నుంచి ఏఎన్నార్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెడుతున్నట్లు కళాశాల పాలకవర్గ సభ్యులు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతోనే ఇంజినీరింగ్ విద్యను ప్రవేశ పెడుతున్నామన్నారు. కేవలం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు మాత్రమే చెల్లించి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించవచ్చని పాలకవర్గ సభ్యులు తెలిపారు.
అక్కినేని వజ్రోత్సవ వైభవం
అక్కినేని వజ్రోత్సవ వైభవం


