పీపీపీని వ్యతిరేకిస్తూ ప్రస్ఫుటమైన ప్రజాగ్రహం
జిల్లా నుంచి ఏకంగా 4.21లక్షల సంతకాల సేకరణ ప్రతులను భారీ ర్యాలీగా తాడేపల్లి తరలించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు 18న గవర్నర్‌కు అప్పగిస్తామన్న నాయకులు
ప్రజా కలం.. నిరసన గళమై నినదించింది.. సంతకాల రూపంలో తమ అభీష్టాన్ని ప్రస్ఫుటం చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సహించబోమని చాటి చెప్పింది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏకంగా 4.21లక్షల మంది సంతకాలు చేశారు. ఈ ప్రతులను సోమవారం విజయవాడ నుంచి భారీ ర్యాలీ నడుమ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.
కోటి సంతకాల వినతి పత్రాలతో కూడిన వాహనాన్ని ప్రారంభిస్తున్న
వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు
ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చిత్రంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ తదితరులు
ర్యాలీలో పాల్గొన్న అవినాష్, వెలంపల్లి, జగన్మోహనరావు, స్వామిదాసు ఎమ్మెల్సీ అరుణకుమార్, మేయర్ భాగ్యలక్ష్మి, జోగి రాజీవ్, షేక్ ఆసిఫ్ తదితరులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు నిర్వహించిన ర్యాలీ ఆద్యంతం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన 4.21 లక్షల సంతకాల ప్రతులను విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా చుట్టుగుంట సెంటర్ నుంచి శిఖామణిసెంటర్ వరకూ నిర్వహించిన ర్యాలీలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో పాటు విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరువూరు ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, నందిగామ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, మైలవరం నుంచి జోగి రాజీవ్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్, ఎండీ రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కడియాల బుచ్చిబాబు ర్యాలీలో ముందు నడువగా, వెనుక ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు అనుసరించారు. శిఖామణి సెంటర్ వద్ద సంతకాల పత్రాలు ఉన్న లారీని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ ఇతర సమన్వకర్తలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
అన్ని నియోజవర్గాల నుంచి రాక..
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 21 డివిజన్‌ల నుంచి వేలాది మంది ప్రజలు ర్యాలీకి తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే ర్యాలీ ప్రారంభమయ్యే ప్రాంతానికి నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి వద్ద నుంచి ర్యాలీగా వచ్చి చుట్టుగుంట సెంటర్‌లో కలిశారు. విజయవాడ పశ్చిమ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నుంచి కూడా భారీగా ప్రజలు తరలివచ్చారు.
నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే..
కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 4,21,217 మంది సంతకాలు చేశారని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గకపోతే, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సంతకాలు మొత్తాన్ని ఈ నెల 18న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కి అందజేస్తామని ప్రకటించారు.
కుట్రలు తిప్పి కొట్టాలి..
పేదలకు అన్యాయం చేయాలని చంద్రబాబు చేస్తున్న కుతంత్రాన్ని తిప్పి కొడతామని జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అర్థం చేసుకొని ఇప్పటికై నా ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమమే..
తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించి కోటి సంతకాలు కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారని చెప్పారు. ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు అంటే మామూలు విషయం కాదని చెప్పారు.
ర్యాలీలో పాల్గొన్న నాయకులు..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు షేక్ ఆసిఫ్, ఇంటూరి రాజగోపాల్, సర్నాల తిరుపతిరావు, రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కంపూడి గాంధీ, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, విజయవాడ డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో పాటు విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు, పార్టీ నేతలు, జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీకి వచ్చిన వారికి మైలవరం,పెనమలూరు నియోజకవర్గాల పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు.
పీపీపీని వ్యతిరేకిస్తూ ప్రస్ఫుటమైన ప్రజాగ్రహం
పీపీపీని వ్యతిరేకిస్తూ ప్రస్ఫుటమైన ప్రజాగ్రహం


