అధికారిక అడ్డా
పేకాటరాయుళ్లకు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట జోరుగా నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడు స్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మొక్కుబడి దాడులతో సరిపెడుతు న్నారు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిన పోస్టు పేకాట జోరుకు నిదర్శనంగా నిలిచింది. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఇది నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్న తీరును, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. విస్సన్నపేట మండలంలోని కొండపర్వ గట్టుపై నిత్యం పేకాట క్లబ్బు నడుపుతున్నారని ఆ మండల ముఖ్య నాయకుడిని ఉద్దేశించి ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌లో చేసిన కామెంట్లు మరోసారి టీడీపీ నాయకులు, పోలీసులను ఇరకాటంలో పడేశాయి. ఇక్కడ ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పార్లమెంటు ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయాల పేరుతో మండల కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. తిరువూరు, విస్సన్నపేటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాల్లోకి ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు ప్రవేశం లేకుండా అడ్డుకట్ట వేశారు. గతంలో పలుమార్లు పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఈ సారి విస్సన్నపేటలో ఓ నాయకుడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో తిరువూరులో గంజాయి అమ్మకాలపై కూడా పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గీయులను టార్గెట్ చేస్తూ పోలీసుస్టేషనులో ఎమ్మెల్యే హల్‌చల్ చేశారు.
తిరువూరు నియోజకవర్గంలో..
తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, మల్లేల, చిట్టేల, తోకపల్లి, కొండపర్వ, పెను గొ లను, ఊటుకూరు, రేపూడి, పుట్రేల, నాయకుల గూడెం, వేమిరెడ్డిపల్లి, తునికిపాడు, కొండూరు, గోపాలపురం గ్రామాల్లో జూదాలు జరుగుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే ఈ జూదాలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల్లో స్థానికులు చెబుతున్నారు.
నందిగామ నియోజకవర్గంలో..
నందిగామ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. కంచికచర్ల రిక్రియేషన్ క్లబ్‌తో పాటు మండలంలోని గొట్టుముక్కల గ్రామంలోని మామిడి తోటలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడే పేకాట ఆడిస్తున్నాడు. ఇతనే కంచికచర్ల ఓసీ క్లబ్‌లోఆరు టేబుళ్లు ఏర్పాటు చేసి పేకాట ఆడిస్తున్నట్టు సమాచారం. గొట్టుముక్కలలో లోన – బయట, కోతముక్క ఆడిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాల ఎదురుగా ఉన్న సందుల్లో రెండు భవనాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయని సమాచారం.
జగ్గయ్యపేటలో..
జగ్గయ్యపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. జగ్గయ్యపేట మండలంలోని చిలకల్లు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుడు అటవీ ప్రాంత గ్రామాలైన గండ్రాయి, మల్కాపురం ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడిస్తున్నాడు. అతనికి పోలీసుల అండదండలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. సంక్రాంతి కోసం అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట ప్రధాన సెంటర్లో ఓ హోటల్‌లో రాత్రి వేళల్లో పేకాట నిర్వహిస్తు న్నారు. ఇటీవల పోలీసులు దాడి చేయగా పేకాట రాయుడు పరారయ్యారు. ఆ హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోలేదు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా పేకాట శిబిరాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే శిబిరాల నిర్వహణ తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్‌లో సంచలన వ్యాఖ్యలు
మైలవరం నియోజకవర్గంలో..
మైలవరం మండలంలో మైలవరం, బొర్రా గూడెం, మొర్సుమల్లి, వెల్వడం, పోరాటనగర్, రెడ్డిగూడెం మండల పరిధిలోని రెడ్డిగూడెం, మొద్దులపర్వ, అన్నేరావుపేట, దాసుళ్లపాలెం, జి.కొండూరు మండల పరిధిలో వెల్లటూరు, వెంకటాపురం, జి.కొండూరు, గంగినేని, మునగపాడు, వెలగలేరు, కందులపాడు, ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని కొండపల్లి ఖిల్లా, మూలపాడు, జూపూడి లంక గ్రామాలు, విజయవాడ రూరల్ ప్రాంతాల్లోని మామిడి తోటలు, అటవీ ప్రాంతాలే అడ్డాలుగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వీటికి స్థానిక టీడీపీ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు సైతం అప్పుడప్పుడు దాడులు చేసి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
నవంబర్ ఒకటో తేదీన వత్సవాయి శివారులో పేకాడుతున్న ఏడుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.24 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ ఏడో తేదీన మైలవరం మండల పరిధి పోరాటనగర్ గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 9 మంది పేకాట రాయుళ్లు చిక్కగా మరి కొందరు పరారయ్యారు. నిందితుల నుంచి రూ.1,15,600 నగదు, 49 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ ఏడో తేదీన రెడ్డిగూడెం మండలం నాగులూరు శివారు మామిడి తోటలో పేకాడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రూ.3.25 లక్షల నగదు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ 9వ తేదీన తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, నాయకులగూడెం, జి.కొండూరు మండలం వెల్లటూరు, కొత్తూరు, గంపలగూడెం మండలంలోని తునికిపాడులో పేకాడుతున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.73,380 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అధికారిక అడ్డా


