అంగన్‌వాడీ.. వేడి!
సాక్షి, అమరావతి: గతంలో తాము చేపట్టిన సమ్మె సమయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం వీరు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఎంసీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలపై అధిక పనిభారం పెడుతోందని, సమాన పనికి సమాన వేతనం నిబంధన ప్రకారం రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. గతంలో 42 రోజులపాటు అంగన్‌వాడీలు ధర్నా చేపట్టినప్పుడు కుప్పంలో జరిగిన ఆందోళనకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబునాయుడు మద్దతు ఇచ్చి.. తాను సీఎం కాగానే డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ, అధికారం చేపట్టి ఇప్పటికి 18 నెలలు కావొస్తున్నా తమ గురించి కానీ, తమకు ఇచ్చిన హామీల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో ఇదే టీడీపీ నేతలంతా అంగన్‌వాడీలకు మద్దతు పలికి.. ఇప్పుడు అధికారం చేపట్టగానే పత్తా లేకుండా పోయారని ఆరోపించారు.
పింఛన్ డ్యూటీ నుంచి మినహాయించాలి..
అంగన్‌వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ.. పింఛన్ డ్యూటీ నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలన్నారు. అలాగే ఆరోగ్య కార్యకర్తలు చేయాల్సిన పనులను కూడా అంగన్‌వాడీలతోనే చేయిస్తున్నారని, గతంలో ఇచ్చిన ఫోన్లు పనిచేయడంలేదని, కొత్తవి ఇవ్వడంతో పాటు అన్ని యాప్‌లను ఒకే యాప్‌గా చేయాలని, తమకు ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లా అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షురాలు టి. గజలక్ష్మి, సీఐటీయూ నగర కార్యదర్శి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


