ఓబీసీల సమస్యలపై 15న ఢిల్లీలో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ వ్యాప్తంగా ఓబీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. అందుకు సంబంధించిన హలో బీసీ.. చలో ఢిల్లీ పోస్టర్‌ను శుక్రవారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధంగా, సామాజిక న్యాయమందించేలా రిజర్వేషన్లు ఇవ్వడానికి, నేటి ఆదిపత్య–పెత్తందారీ రాజకీయ వ్యవస్థకున్న అభ్యంతరాలను స్పష్టం చేయాలని వారు నిలదీశారు. అనేక దశాబ్దాలుగా రాజకీయంగా చట్టసభలు, స్థానిక సంస్థల్లోనూ బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కేటాయించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమ రూపాలలో పోరాడుతూనే ఉన్నామన్నారు. తరాలు మారుతున్నాయే గాని, బీసీల సామాజిక–ఆర్థిక–రాజకీయ అంతరాల నిర్మూలనకు మాత్రం ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే శరణ్యమని భావిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆ సంఘ ఉపాధ్యక్షుడు కనకారావు, ఉద్యోగ సంఘాల కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరవు, బీసీ నాయకులు మేకా వెంకటేశ్వరరావు, వాక వెంకటేశ్వరరావు, రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.
వైఎస్సార్ సీపీలో తిరుపతిరావుకు అదనపు బాధ్యతలు
జి.కొండూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం జి.కొండూరుకు చెందిన వేములకొండ తిరుపతిరావును పంచాయతీ రాజ్ విభాగం జోన్–3 కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తిరుపతిరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఓబీసీల సమస్యలపై 15న ఢిల్లీలో ధర్నా


