రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలుకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ పక్కదారి పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం జేసీ ఇలక్కియ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వను అరికట్టే విషయాలపై జిల్లా పౌర సరఫరా శాఖ సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు బోర్డర్ చెక్ పోస్ట్‌కు వచ్చే వాహనాలు, కోళ్ల ఫారాలు, చేపల చెరువులను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. వీటిలో రేషన్ బియ్యాన్ని వినియోగిస్తే 6–ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అందరు ఎల్‌పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ పంపిణీ తీరుపై సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం ముఖ్యమన్నారు. గ్యాస్ ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తప్పవని జేసీ ఇలక్కియ స్పష్టం చేశారు.
6–ఏ కేసుల్లో పలువురికి జరిమానా
కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ శుక్రవారం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 6–ఏ కేసుల కోర్టు నిర్వహించారు. ఈ కోర్టులో కేసులు నమోదు అయిన వ్యక్తులను, నమోదు చేసిన అధికారులను విచారించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరానికి ఉపయోగించిన వారికి రూ.11 వేల జరిమానా విధించారు. 133 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వ పరం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు వినియోగించిన ఒక వాహన యజమానికి రూ.5 వేలు, పీడీఎస్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసిన వారికి రూ.58 వేల జరిమానా విధించారు.


