రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఇలక్కియా
తిరువూరు: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. విస్సన్నపేట, గంపలగూడెం, పెదకొమెర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. తిరువూరు రెవెన్యూ డివిజన్లో 53, నందిగామ డివిజన్లో 46, విజయవాడ డివిజన్లో 37 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 23లక్షల 21వేల 400 గోనెసంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంతవరకు 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.146 కోట్ల నగదు జమ చేశామన్నారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఇబ్బందులను ఇలక్కియా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారుల్ని ఆదేశించారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాష ఔన్నత్యం, సాంస్కృతిక వైభవాన్ని తెలియచేసేలా అధికార భాషా సంఘం పని చేస్తుందని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన పి.త్రివిక్రమరావు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో గురువారం భవానీపురంలోని హరిత బెరంపార్క్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యఅతిధిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ త్రివిక్రమరావుతో ప్రమాణం చేయించారు. అనంతరం త్రివిక్రమరావు మాట్లాడుతూ అందరి సలహాలు, సూచనలతో ముందుకు వెళతానని తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, కాపు కార్పొరేషన్, ఏపీ నాటక అకాడమి, ఉర్దూ అకాడమీ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, గుమ్మడి గోపాలకృష్ణ, ఫారేఖ్ షుబ్లీ, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్.చంద్రకళ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆమె తాజా బదిలీలలో ఎన్టీఆర్ జిల్లాకు వచ్చారు. గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆమెకు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆమె ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థులకు చేర్చటం, పర్యవేక్షణ బలోపేతం చేస్తానన్నారు. పారదర్శక సేవలను అందిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు బోధనా సిబ్బంది సమష్టిగా పనిచేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని సూచించారు.
యూటీఎఫ్ నాయకుల శుభాకాంక్షలు
డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన చంద్రకళకు యూటీఎఫ్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆమెను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య నాయకులు పి.లీల, జె.రామకృష్ణ, ఎం.లలిత, ఎ.భరత్, ఎస్పీహెచ్‌ఆర్ దేవ్ తదితరులు ఉన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు


