సృజనాత్మకత వెలికితీయడానికే బాలోత్సవం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మతకను వెలికితీయడానికి బాలోత్సవం దోహదం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అమరావతి బాలోత్సవం గురువారం సాయంత్రంతో ముగిసింది. ముగింపు సభకు లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కులు, గ్రేడ్‌లు, ర్యాంకులు, నీట్, ఐఐటీల పైనే శ్రద్ధ చూపుతున్నాయని తెలిపారు. పిల్లల మానసిక వికాసానికి అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ఏటా అమరావతి బాలోత్సవం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అమరావతి బాలోత్సవం స్ఫూర్తిగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ విధమైన బాలోత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బాలోత్సవం వ్యవస్థాపకుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక వికాసానికి, వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలోత్సవ్ ఉపయోగపడుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు మాట్లాడుతూ గత ఏడు ఏళ్లుగా నిర్వహించిన దానికన్నా ఈ ఏడాది ఎంతో భిన్నంగా బాలోత్సవ్‌లో కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ ఏడాది అత్యధికంగా 16,500 మంది విద్యార్థులు వివిధ అంశాలో ్ల పాల్గొని ప్రతిభను చూపారన్నారు. సభ అనంతరం పోటిల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందచేశారు. బాలోత్సవ్ గౌరవాధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు, అధ్యక్షుడు ఎస్‌పి.రామరాజు, మంగళగిరి, తాడేపల్లి బాలోత్సవ్ అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, నిర్వహణ కమిటీ సభ్యులు పి.మురళీకృష్ణ, విద్యాకన్నా, రావి శారద తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటిల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద నృత్యాల పోటీల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సృజనాత్మకత వెలికితీయడానికే బాలోత్సవం


