అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు రూ.27 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం
మైలవరం: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ, ఏసీపీ వై. ప్రసాదరావు తెలిపారు. మైలవరం పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేసుకుని మైలవరం సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు వారి నుంచి రూ.27,50, 050 విలువ గల వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలల నుంచి మైలవరం సబ్ డివిజన్, సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఏసీపీ వై. ప్రసాదరావు మైలవరం సర్కిల్ సీఐ దాడి చంద్రశేఖర్ పర్యవేక్షణలో మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఎస్‌ఐలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆరుమళ్ళ పురుషోత్తం, (ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల జిల్లా, తెలంగాణరాష్ట్రం)తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో పురుషోత్తంతో పాటు మరో నలుగురు చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరవల్లి మండలం తేలుప్రోలుకు చెందిన పొట్లూరి పద్మతో పురుషోత్తం సహజీవనం చేస్తూ ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నిర్మానుష్యంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను దొంగతనాలకు వీరు ఎన్నుకుంటున్నారు. అందుకోసం వీరితో పాటు మైలవరం మండలం తోలుకోడు, వెల్వడం రోడ్‌లో ఉంటున్న ఏకుల రవికుమార్, ఏకశిరి అభిలాష్ , ఏకశిరి చిట్టెమ్మ కలిసి ఒక బృందంగా ఏర్పడి ఏడాది నుంచి ఆలయాల్లో దొంగతనాలుకు పాల్పడుతున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్‌లో 3, జి.కొండూరు 2, రెడ్డిగూడెం 1, ఆగిరిపల్లి 1, ద్వారకా తిరుమల 1, తాడేపల్లిగూడెం 1, విజయవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 1 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీనితో ఆరుమల్ల పురుషోత్తంలో పాటు అతని టీమ్‌ను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న సొమ్మును రికవరీ చేశారు. వీరిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో చోరీ కేసులు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన మైలవరం ఎస్‌ఐ సుధాకర్, రెడ్డిగూడెం ఎస్‌ఐ, జికొండూరు ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్స్‌ను పోలీస్ అధికారులు అభినందించారు.


