హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, సీఓఈ నియామకాలపై నిర్ణయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు గురువారం జరిగాయి. ఆయా సమావేశాల్లో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, ఆయుష్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌లతో పాటు, వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీ సమావేశంలో 11 అంశాలపై చర్చించి ఆమోదించగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్‌లో 14 అంశాలు ఆమోదించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుత రిజిస్ట్రార్ పదవీ కాలం జనవరి 26తో ముగియనుండడంతో కొత్త రిజిస్ట్రార్ నియామకంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కర్నూలుకు చెందిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించేందుకు తీర్మానం చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా తిరుపతి స్విమ్స్‌లోని అనాటమీ ప్రొఫెసర్‌ను నియమించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వీరిద్దరి నియామకాలపై గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌కు రీసెర్చ్ ఫండ్ విడుదల, క్రీడల నిర్వహణకు అవసరమైన వ్యయం విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య విద్యార్థులు వత్తిడికి గురికాకుండా ప్రతి 20 మందికి ఒక కౌన్సిలర్స్ కౌన్సెలింగ్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.సమావేశంలో యూనివర్సిటీ పాలకవర్గ సభ్యులు, ఫైనాన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


