16 నుంచి ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఉర్దూ అకాడమీ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ అన్నారు. ఉర్దూ అకాడమీ ఏపీ ఉద్యోగుల సమీక్ష సమావేశం విజయవాడ పాతబస్తీలోని ముసాఫిర్‌కానా ప్రాంగణంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భాషకు మతంతో సంబంధం లేదన్నారు. ఉర్దూ అకాడమీ ఉద్యోగుల్లో పని చేసిన వారికి గుర్తింపు, చెయ్యని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. సమీక్ష సమావేశానికి గైర్హాజరైన వారికి తక్షణమే మెమో జారీ చెయ్యాలని చైర్మన్ శుబ్లీ ఆదేశించారు. మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గౌస్‌పీర్ పాల్గొన్నారు.
ఆర్‌ఎంపీలకు అవగాహన
మచిలీపట్నం అర్బన్: జిల్లాలో ప్రథమ చికిత్స కేంద్రాలను నిబంధనలకు లోబడి నిర్వహించేలా ఆర్‌ఎంపీలకు అవగాహన కల్పించే సమావేశాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. యుగంధర్ నిర్వహించారు. ఇటీవల జిల్లాలోని పలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ యుగంధర్ పలు సెంటర్లను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. తనిఖీల అనంతరం జరిగిన ఈ సమావేశంలో ఆర్‌ఎంపీలకు ప్రథమ చికిత్స కేంద్రాల్లో అనుమతి పొందన సేవలు, చేయకూడని వైద్య ప్రక్రియలు, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన ప్రొటోకాల్ వంటి అంశాలపై వివరంగా మాట్లాడారు. ఇటీవల జిల్లాలో వెలుగుచూస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి పై ఆర్‌ఎంపీలకు అవగాహన కల్పించారు.


