విజయ డెయిరీ మాజీ చైర్మన్ జానకి రామయ్య కన్నుమూత
గన్నవరంరూరల్: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య(94) గురువారం ఉదయం చిన అవుటపల్లిలోని రుషివాటికలో ఉన్న స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, మండలి బుద్ధ ప్రసాద్, వర్లకుమార్ రాజా, బోడే ప్రసాద్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు, విజయడెయిరి ఛైర్మన్ చలసాని ఆంజనేయులు సందర్శించి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం విజయడెయిరి ఛైర్మన్‌గా పని చేసి సంస్థను అభివృద్ధి బాటలో నడిపించారని కొనియాడారు. పాల రైతులకు అనుకూలంగా నిర్ణయాలు, సంస్కరణలు రూపొందించి పాడి రైతుల సంక్షేమానికి బాటలు వేశారని ప్రశంసించారు. ఆయన కుమారుడు వెంకటరత్నం అంత్యక్రియలు దావాజీగూడెం శ్మశాన వాటికలో నిర్వహించారు.


