వైఎస్సార్‌సీపీ నేత గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం
సత్యనారాయణపురం (విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని ఆయన కార్యాలయం సెల్లార్‌లో నిలిపి ఉంచిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం బయటపడింది. రోజూ గౌతమ్‌రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం గమనించి ఈ దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. వివరాలు... గత నెల 12న ఉదయం 10.50 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఒకరు గౌతమ్‌రెడ్డి కార్యాలయ సెల్లార్‌లోకి వెళ్లాడు. అక్కడ కాసేపు అటుఇటు తిరిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న బ్యాగ్ నుంచి సీసా తీసి కారుపై పెట్రోల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించి పరారయ్యాడు. దీంతో కారు కాలిపోయింది. తాను రోజూ పనుల విషయమై బయటకు వెళ్లే సమయంలోనే ఇలా జరగడంతో ఇది హత్యాయత్నమేనని, ఆ సమయంలో లేకపోవడంతో కారు దగ్ధం చేసినట్లు గౌతమ్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తం ఉదంతంతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించానని చెప్పారు. కానీ, పోలీసులు ఇంతవరకు ఘటన గురించి విచారణ జరపకుండా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది రెండోసారి...
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తనపై రెండోసారి హత్యాయత్నం జరిగిందని గౌతమ్‌రెడ్డి తెలిపారు.
గతంలోనూ గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, దీనిని పోలీసులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పెద్దలను మెప్పించేలా పోలీసులు నడుచుకుంటున్నారని, రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను కూడా విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, గత నెలలోనే గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు చేసినా, దాన్ని చూడలేదని సీఐ లక్ష్మీనారాయణ చెప్పడం గమనార్హం. మరోవైపు హత్యాయత్నం ఉదంతం గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు హడావుడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గౌతంరెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీపీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.
పెట్రోల్ పోసి కారును దగ్ధం చేసిన గుర్తుతెలియని నిందితుడు
రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలోనే ఈ ఘటన!
ప్రాణహాని ఉందని గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోని
పోలీసులు
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హడావుడిగా ఎఫ్‌ఐఆర్
వైఎస్సార్‌సీపీ నేత గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం


