సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రెండో రోజూ తనిఖీలు
ఇబ్రహీంపట్నం: స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు రెండో రోజు గురువారం కూడా కొనసాగాయి. బుధవారం అర్థరాత్రి 12 గంటల వరకు రికార్డులు తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం మరోసారి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి చేరుకున్నారు. రెండోరోజు రిజిస్టార్ కార్యాలయం అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న పలువురు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారి బీవీ సుబ్బారావు గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయం కార్యకలాపాలు, నగదు లావాదేవీలు అన్నీ వారి కనుసన్నలలోనే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లకు రూ.లక్షల్లో ఫోన్ పే చెల్లింపులు జరిగినట్లు గమనించారు. పలు రికార్డులు పరిశీలించి అనుమానాస్పద రికార్డులు, పలు డాక్యుమెంట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌చార్జ్ సబ్ రిజిస్టార్ ఎస్కే మహ్మద్‌తో పాటు ఇతర సిబ్బందిని కూడా విచారించారు. పూర్తి విచారణ జరిగిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని డీఎస్పీ సుబ్బారావు మీడియాకు వెల్లడించారు.
పలువురు డాక్యుమెంట్ రైటర్లను
విచారించిన ఏసీబీ
పూర్తి తనిఖీల అనంతరం నివేదిక
ప్రభుత్వానికి అందిస్తామన్న అధికారులు


