మునేరు ముంచేస్తోంది!
పెనుగంచిప్రోలు: వస్తే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి. ఈ రెండిటి మధ్య అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పండించే పంటకు అనుకూలంగా నిరంతర విద్యుత్ సౌకర్యం ఉంది. పక్కనే మునేరు ఉంది. అయినా ప్రకృతి పగ పట్టినట్లు రైతన్నపై కన్నెర్ర జేస్తోంది. నోటికాడికి వచ్చిన పంట ఏటా మునేరు వరదలకు నీటిపాలవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో మునేరు పరివాహక ప్రాంతాలైన వత్సవాయి మండలం ఆల్లూరుపాడు, వేమవరం, పెనుగంచిప్రోలు మండలంలోని పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, కె.పొన్నవరం తదితర గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాలు మాగాణి పొలాలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మునేరుకు గతంలో ఎన్నడూ లేని విధంగా 3 లక్షలు క్యూసెక్కులు వరద నీరు వచ్చింది., ఈఏడాది కూడా సుమారుగా 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. రెండేళ్లుగా వరదలకు పంట పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతకు మందు కూడా మునేరుకు ప్రతి ఏడాది పంట చేతికొచ్చే సమయంలో వరదలు వచ్చి పంట మొత్తం వరద నీట మునిగి నష్ట పోతున్నామని రైతులు అంటున్నారు.
దిక్చుతోచని స్థితిలో రైతులు...
మునేరు వరద ముంచెత్తటంతో పంట మొత్తం నేలవాలింది. నీటిలో నాని మొలకలు వస్తున్నాయి. దీంతో చేసేది లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏటా రూ.వేలాది రూపాయిలు ఖర్చు పెట్టి పంటలు పండిస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తుంటే చేతికొచ్చిన పంటటు నేలపాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం గురించి పట్టించుకునే నాధుడు కరువయ్యారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఏటా నీట మునుగుతున్న
పరీవాహక పంట పొలాలు
చేతికొచ్చిన పంట వరద పాలు
తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు
మునేరు ముంచేస్తోంది!


