ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధంకండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్–ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకొని సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని కీలక సెక్షన్లు, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రాధాన్యత, గత ఎస్‌ఐఆర్ (2002), సమగ్ర సవరణ ప్రక్రియలో భాగస్వామ్య పక్షాలు, బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌వో), బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ), ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు తదితరుల పాత్ర, ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్), ఇంటింటి సందర్శన, పరిశీలన తదితర అంశాలతో పాటు రాజకీయ పార్టీల భాగస్వామ్యం గురించి వివరించారు. వీసీ అనంతరం లక్ష్మీశ కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులతో మాట్లాడుతూ సన్నద్ధతలో భాగంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని ముఖ్య దశలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ అవగాహన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. వివిధ ఫారాల పరిష్కారం, ఎపిక్ కార్డుల జారీ తదితరాలపైనా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ పి.సలీమ్, డిప్యూటీ తహసీల్దార్ ఎ.గోపాలర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


