దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.4.33 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 20 రోజులకు గాను 44 హుండీల ద్వారా 167 సంచులను తెరిచి కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మొత్తం రూ.4,33,85,655 నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 6.614 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభ్యమైంది. యుఎస్‌ఏకి చెందిన 582 డాలర్లు, సింగపూర్ డాలర్లు 22, కెనడా డాలర్లు 215, యుఏఈకి చెందిన 485 దిర్షమ్స్, అస్ట్రేలియా డాలర్లు 250, మలేషియా రింగిట్స్ 23, ఖతార్ రియాల్స్ 18, కువైట్ దినార్ 2.25, ఇంగ్లాండ్ పౌండ్లు 15 లభ్యమయ్యాయి. కానుకల లెక్కింపును ఛైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.


