యాజమాన్యం నిర్లక్ష్యానికి క్వారీ కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

యాజమాన్యం నిర్లక్ష్యానికి క్వారీ కార్మికుడి మృతి

Oct 28 2025 8:42 AM | Updated on Oct 28 2025 8:42 AM

యాజమాన్యం నిర్లక్ష్యానికి క్వారీ కార్మికుడి మృతి

యాజమాన్యం నిర్లక్ష్యానికి క్వారీ కార్మికుడి మృతి

యాజమాన్యం నిర్లక్ష్యానికి క్వారీ కార్మికుడి మృతి స్టాగ్‌నేటెడ్‌ వాటర్‌ దిగువకు విడుదల ఏపీ సచివాలయ ఉద్యోగి ఇంట్లో చోరీ

దొనబండ(ఇబ్రహీంపట్నం): బ్లాస్టింగ్‌ కోసం కొండపై డ్రిల్లింగ్‌ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడిపోయిన వ్యక్తి మృతి చెందిన ఘటన దొనబండలోని ఓ క్వారీలో సోమవారం జరిగింది. ప్రమాదంలో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ఉప్పుతల కృష్ణ(27)గా గుర్తించారు. గ్రామానికి చెందిన ఉప్పతల శ్రీరాములు, నాగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. మృతిచెందిన కృష్ణ రెండో కుమారుడు. ఈ ఏడాది జనవరిలో కృష్ణ తండ్రి శ్రీరాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు కూడా క్వారీ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాజమాన్య నిర్లక్ష్యం, క్వారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, భద్రతా పరికరాలు వాడనందునే ప్రమాదాలు జరుగుతున్నాయని బిల్డింగ్‌ కన్సక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తెలిపారు. మృతిని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అధికార యంత్రాంగం ప్రమాదాలు జరిగినప్పుడు నామమాత్రపు తనిఖీలు నిర్వహించి తరువాత పట్టించుకోక పోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ బి.రాజు తెలిపారు.

జి.కొండూరు: మోంథా తుఫాన్‌ నేపథ్యంలో పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌లో హెడ్‌రెగ్యులేటర్ల మధ్యలో రైతుల అవసరాల కోసం నిల్వ ఉంచిన నీటిని అధికారులు సోమవారం కృష్ణానదిలోకి విడుదల చేశారు. బుడమేరుతో పాటు పోలవరం రైట్‌మెయిన్‌ కెనాల్‌ కూడా వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద డైవర్షన్‌ కెనాల్‌లో కలిసి ప్రవహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే ఒక వైపు బుడమేరుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. మరో వైపు పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌లో కూడా వర్షం నీరు పోటెత్తి ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టాగ్‌నేటెడ్‌ వాటర్‌ని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో బుడమేరులో ఎగువ నుంచి వచ్చే కొద్దిపాటి ప్రవాహంతో పోలవరం రైట్‌మెయిన్‌ కెనాల్‌లో స్టాగ్‌నేటెడ్‌ వాటర్‌ కలిసి వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద 3.3 అడుగుల మేర నీటి నిల్వ ఉండగా కృష్ణానదిలోకి 3,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది.

మంగళగిరిటౌన్‌: ఏపీ సచివాలయ ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు సుమారు రూ.లక్షకు పైగా నగదును దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాలు... దుగ్గిరాలకు చెందిన గోళ్ల గణేష్‌, వెలగపూడి ఏపీ సచివాలయం ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం భార్య, ఇద్దరు కుమారులతో కలసి యరబ్రాలెంలోని ఓ నివాసంలో అద్దెకు దిగారు. ఇటీవల గణేష్‌ తల్లి అనారోగ్యానికి గురైంది. దీంతో ఈనెల 23వ తేదీన దుగ్గిరాల వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం యరబ్రాలెంలోని ఇంటికి వెళ్లగా ఇంటి తలుపులకు వేసి ఉన్న తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్లి చూడగా బీరువాలో బట్టలు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులతో పాటు సుమారు రూ.లక్షకు పైగా నగదు మాయమైందని గుర్తించారు. దీంతో బాధితుడు డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. పోలీసులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో బాధితుడు విస్మయం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement