బంగారు ఆభరణాలపై కన్నేసింది.. కొట్టేసింది | - | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాలపై కన్నేసింది.. కొట్టేసింది

Oct 28 2025 8:42 AM | Updated on Oct 28 2025 8:42 AM

బంగారు ఆభరణాలపై కన్నేసింది.. కొట్టేసింది

బంగారు ఆభరణాలపై కన్నేసింది.. కొట్టేసింది

ఇంట్లో పనిమనిషిగా వచ్చి.. విడతల వారీగా 837 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అనారోగ్యం పేరుతో పని మానేసిన వైనం చోరీని ఆలస్యంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని గంటల వ్యవధిలోనే నిందితురాలి గుర్తింపు, ఆభరణాల రికవరీ మీడియా సమావేశంలో నగర సీపీ రాజశేఖరబాబు

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ మారుతీనగర్‌కు చెందిన చీపురుపల్లి సుమలత అలియాస్‌ లత సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలోని ఓ ఇంట్లో వంట, ఇంటి పనిచేసేందుకు చేరింది. ఇంట్లో పనులు చేస్తూ చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయని గ్రహించి, వాటినీ చోరీ చేయాలని భావించింది. ఒకేసారి అయితే అనుమానం వస్తుందని, పని ముగించుకుని వెళ్లేటప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఒక్కో ఆభరణం ఎత్తుకెళ్లింది. అలా 837 గ్రాముల ఆభరణాలను తస్కరించింది. ఆరు నెలల కిందట తండ్రి మరణంతో ఆరోగ్యం బాగుండటం లేదని చెప్పి పనిమానేసింది. ఆలస్యంగా గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లత నుంచి చోరీకి గురైన రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

సిబ్బందికి అభినందనలు..

సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలో నివశించే ఫిర్యాది తమ ఇంట్లోని 837 గ్రాముల బంగారు వస్తువులు ఎవరో దొంగిలించారని సోమవారం సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటికి వెళ్లి అనుమానితుల వివరాలు సేకరించారు. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కేజీవీ సరిత సూచనలతో సౌత్‌జోన్‌ ఏసీపీ డి.పావన్‌కుమార్‌ పర్యవేక్షణలో సూర్యారావుపేట సీపీ షేక్‌ అహ్మద్‌ అలీ తమ సిబ్బందిలో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఆ ఇంట్లో పనిచేసి మానేసిన మహిళ సుమలతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె నుంచి రూ.కోటి విలువైన 837 గ్రాముల ఆభరణాలను రికవరీ చేశారు. గంటల వ్యవధిలోనే కేసును చేధించడంతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సౌత్‌ ఏసీపీ డి.పావన్‌కుమార్‌, ఎస్‌ఆర్‌పేట సీఐ షేక్‌ అహ్మద్‌ అలీ, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు అభినందించారు. సమావేశంలో డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, క్రైమ్‌ ఏడీసీపీ ఎం.రాజారావు, సౌత్‌ ఏసీపీ పావన్‌కుమార్‌, ఎస్‌ఆర్‌పేట సీఐ అహ్మద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement