
సాంకేతికత సాయంతో రోడ్డు ప్రమాదాల నివారణ
రహదారి భద్రత కమిటీ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శుక్రవారం రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా జిల్లాలోని మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్లాక్ స్పాట్‌లను గుర్తించి సమస్యలను పరిష్కరించాలన్నారు. అవసరమైన చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ పవర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా అమర్చకపోవటం పట్ల ఆయన జాతీయ రహదారుల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం నగరంలోని ప్రధాన రహదారులపై యూ–టర్న్ తీసుకుని వచ్చే వాహనాలు ఆ వాహనాలకు ఎదురుగా వచ్చే ఇతర వాహనాలు పరస్పరం ఢీకొని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన బారీకేడ్లకు బదులుగా ఎత్తు తక్కువగా ఉండే సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రత్యేక పరికరం..
వాహనం నడిపే సమయంలో వాహనచోదకుడు ఫోన్ మాట్లాడటం, స్టీరింగ్ సరిగ్గా పట్టుకోకుండా నడిపినా అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక పరికరం పనితీరుపై గంగూరు ధనేకుల కళాశాల విద్యార్థులు డెమో ద్వారా వారికి వివరించారు. వాహనాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 2025 సెప్టెంబర్ నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 63 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిలో 32 మరణాలు, 47మందికి గాయాలయ్యాయన్నారు. సమావేశంలో ఏఎస్పీ వీవీ నాయుడు, జిల్లా రవాణాధికారి ఎన్‌యూఎన్‌ఎస్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.