
శాస్త్రసాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలి
డీఈవో సుబ్బారావు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీ స్థానిక బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రతిభ చూపిన విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. క్వాంటమ్ ప్రారంభం – అవకాశాలు– సవాళ్లు అంశంపై సెమినార్ పోటీలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతభ చూపిన విద్యార్థులను 18వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ విద్యాసంస్థకు చెందిన బి. ఉషాకిరణమై ప్రథమ, పటమట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి బి. రబిస్మిత ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. విద్యార్థులకు డీఈవో చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పిచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.