
జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు
కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా యువత నైపుణ్యాలు సముపార్జించాలని, అప్పుడే కెరీర్ పరంగా ప్రపంచ వ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన వివరాలను, సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో పాటు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రష్యా, జర్మనీ, ఖతార్ తదితర దేశాల్లో కూడా వివిధ ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆయా భాషల్లో శిక్షణతో పాటు ఉద్యోగాలు పొందేందుకు చేయూతనందిస్తోందన్నారు. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ వెంట జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు ఉన్నారు.
నవంబరు 22, 23 తేదీలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు
విజయవాడ కల్చరల్: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సంకల్పంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్యవేదిక సహకారంతో నవంబరు 22, 23 తేదీలలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రెండు రోజులపాటు సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు కలిమిశ్రీ తెలిపారు. గాంధీనగర్‌లోని హోటల్ ఐలాపురంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి సంగీత, సాహిత్య, నాటక రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెలుగు సాహితీ వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలుంటాయని తెలిపారు. సాంస్కృతిక ఉత్సవాల విజయవంతానికి కామ్రేడ్ జీఆర్‌కే, పోలవరపు సాహితీ సమితి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పోస్టర్‌ను అతిథులు ఆవిష్కరించారు. వివిధ రంగాలకు చెందిన మీసాల రాజేశ్వరరావు, గొరిపర్తి హనుమంతరావు, ఉత్సవ కమిటీ బాధ్యులు చొప్పా రాఘవేంద్ర చంద్రశేఖర్, పి.చిదంబరం, వైడీ ఆనంద్ పాల్గొన్నారు.
పున్నమిఘాట్‌లో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక పున్నమి ఘాట్‌లో గురువారం రాత్రి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఆదాయపు పన్ను కమిషనర్ ప్రకాష్, ఐసీడీఎస్ పీడీ ఎస్‌కే రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అంశంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మనోజ్‌కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లాలో నేటి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని 159 రైతు సేవా కేంద్రాల ద్వారా 17వ తేదీ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ టీవీ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో మొత్తం 3,59,733 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో సుమారు 3,03,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తిరువూరు మండలంలోని మునకుళ్ల రైతు సేవా కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతు సేవా కేంద్రాలను వినియోగించుకుని, మద్దతు ధర పొందాలని డీఎం టీవీ సతీష్ ఆ ప్రకటనలో కోరారు.

జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు