
దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మి యాగం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ధనత్రయోదశిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని నూతన యాగశాలలో ఆదివారం శ్రీమహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్, వైదిక కమిటీ పర్యవేక్షణలో తొలుత గణపతి పూజ, కలశస్థాపన, పూజా కార్యక్రమాల అనంతరం యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగంలో చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ..
దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాజగోపురం వద్ద ఆలయ అర్చ కులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరగ గా, పలువురు భక్తులు, ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
నేడు ధనలక్ష్మి పూజ..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం అమ్మవారి ప్రధాన ఆలయంలో ఆలయ అర్చకులు ధనలక్ష్మి పూజ నిర్వహించనున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పూజను జరిపిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ దీపాలను వెలగించిన అనంతరం రాజగోపురం ఎదుట దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు.