
అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): గొల్లపూడి పరిధిలోని రామరాజ్యనగర్‌లో ఆదివారం వేకువజామున మూడు గంటల సమయంలో ఒక కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రామరాజ్యనగర్‌లో ఒక ఇంట్లో ఆకాష్ అనే వ్యక్తి ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. పెయింట్స్‌లో కలిపే టిన్నర్‌ను లీటర్, రెండు లీటర్ల చొప్పున ప్యాకింగ్ చేస్తుంటారు. ఈ పనులను ఐదుగురు యువకులు చేస్తుంటారు. ఈ క్రమంలో జోరున వర్షం కురుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షణ్ముఖ శ్రీనివాస్ (16) మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. రమణబాబు (19) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ యజమాని చైన్నె వెళ్లాడు. పీసా పవనసాయి మణికుమార్, మోహన్‌కృష్ణ ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ):కేటీరోడ్డు పరిధిలోని భీమనవారిపేటలో ఓ మెడికల్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కొత్తపేట పోలీసులు ఆదివారం గుర్తించారు. లంబాడీపేటలోని రాకేష్ మెడికల్ స్టోర్స్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడంటూ పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మెడికల్ షాపు మెట్లపై ఓ యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. అయితే స్థానికులను ఆరా తీయగా ఆ వ్యక్తి ఏలూరుకు చెందిన కె. శేఖర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.