
దళిత వ్యతిరేకి చంద్రబాబును గద్దె దింపుదాం
మళ్లీ జగన్ వస్తేనే మనుగుడ..
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలోని దళితులను అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పేందుకు ఐక్యంగా సన్నద్ధం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవే టీకరించడాన్ని, నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ‘మాట్లాడుకుందాం.. రండి..’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ ఎస్సీ సెల్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం, పెడన, పెనమలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జి లు పేర్ని కిట్టు, ఉప్పాల రాము, దేవభక్తుని చక్రవర్తి, మచిలీపట్నం పార్లమెంట్ ఇన్‌చార్జి జెట్టి గురునాథం పాల్గొని మాట్లాడారు.
ఎవరిది సంపద సృష్టి..
రాష్ట్రంలోని పేద వర్గాలకు విద్యను, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారన్నారు. వాటిలో ఐదు కళాశాలలు ప్రారంభం కాగా, మరో రెండు ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు. పులివెందుల కళాశాలకు ఎన్‌ఎంసీ ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినా చంద్రబాబు ప్రభుత్వం వద్దని లేఖ రాసి.. పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ ఆస్తులను పెంచితే వాటిని చంద్రబాబు కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.
10 అంశాలపై తీర్మానం..
నకిలీ మద్యం వ్యవహారంపై నిజానిజాలు బయటకు వచ్చేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, నకిలీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 10 డిమాండ్లను ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పేదలకు విద్య, వైద్యాన్ని దూరం
చేస్తున్న కూటమి ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్
‘మాట్లాడుకుందాం.. రండి’
కార్యక్రమంలో వక్తలు
మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాలకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. అంబేడ్కర్ కలలుగన్న విధంగా విద్యతోనే సమాజ మార్పు జరుగుతుందన్న విషయాన్ని అమ్మఒడి, నాడు– నేడు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో జగన్ చేసి చూపించారన్నారు. మరోసారి జగన్‌ను సీఎంను చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని సుధాకర్ బాబు పిలుపునిచ్చారు.