
సూత్రధారులు చంద్రబాబు, లోకేష్‌లే
జయచంద్రారెడ్డి, జనార్దన్‌లు పాత్రధారులు మాత్రమే నకిలీ మద్యం డబ్బులు పంచుకున్న ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంత కేసును పక్కదారి పట్టించేందుకే జోగి రమేష్‌పై ఆరోపణలు ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు, పోలీసుల జపం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం మాఫియా వ్యవహారంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ను గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యం స్కాంలో జయచంద్రారెడ్డి, జనార్దన్‌లు కేవలం పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అని అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం ద్వారా వచ్చిన డబ్బులు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కావాలని కేసును పక్కదారి పట్టించేందుకు జోగి రమేష్ పాత్ర ఉందని, ప్రధాన నిందితుడు జనార్దనరావుతో చెప్పించారని అన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై జోగి రమేష్ పోరాటాలు చేస్తున్నారని, నకిలీ మద్యంపై తొలిసారిగా గళం విప్పింది ఆయనే అని అన్నారు. నకిలీ మద్యం రాకెట్‌పై సీబీఐ విచారణ కోరింది కూడా జోగి రమేష్ అని గుర్తు చేశారు. ఆయన్ను మానసికంగా దెబ్బతీయడం కోసమే తప్పుడు కేసు పెట్టారని అన్నారు. జోగి రమేష్‌కు జిల్లా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, తమ పార్టీ నాయకులు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పని చేసినవారు ఫిర్యాదు చేయడానికి వస్తే కలవని సీపీ టీడీపీ చోటామోటా నాయకులు వస్తే కలవడం చూస్తే ఏ విధంగా పని చేస్తున్నారో అర్ధమవుతోందన్నారు. ఏ పదవీ లేని బుద్ధా వెంకన్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తే తనను గుర్తిస్తారన్న తపనతో తమ నాయకులపై కారుకూతలు కూస్తున్నాడని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకు ముందు మాజీ మంత్రి జోగి రమేష్‌తో ప్రస్తుత పరిణామాలపై కొద్దిసేపు చర్చించారు. పోలీసులు ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, కుంచం జయరాజును కూడా పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు జెడ్పీటీసీ మందా జక్రధరరావు, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గుంజా శ్రీనివాస్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు పోరంకి శ్రీనివాసరాజు, రెంటపల్లి నాగరాజు, నాయకులు జడ రాంబాబు, మిక్కిలి శరభయ్య తదితరులు పాల్గొన్నారు.