
విజయవంతంగా ‘స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్’
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా విజయవాడ డివిజన్‌లో పక్షం రోజులుగా నిర్వహించిన స్వచ్ఛత పక్వాడ–2025 విజయవంతంగా ముగిసిందని విజయవాడ రైల్వే ఏడీఆర్‌ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు తెలిపారు. డీఆర్‌ఎం కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లోని రైల్వే స్టేషన్‌లు, రైల్వే ప్రాంగణాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత డ్రైవ్‌లు విజయవంతంగా ముగిశాయన్నారు. అందులో స్వచ్ఛత అభియాన్, స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలతో విస్తృతమైన డ్రైవ్‌లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు.
ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు
1,595 మంది అధికారులు, 2,243 మంది వలంటీర్లతో పరిశుభ్రత డ్రైవ్‌లు నిర్వహించడం ద్వారా 9,166 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమాలు, 64.7 కి.మీ. ట్రాక్‌లు, 341 మీటర్ల డ్రెయిన్‌లు, 30 కార్యాలయాలను శుభ్రపర్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేసిన వారిపై 114 కేసులు నమోదు చేయడం ద్వారా రూ.24,800 పెనాల్టీలు వసూలు, ఒక టన్ను వ్యర్థాలను తొలగించడం, 26 రైళ్లను శుభ్రపర్చడం, మొక్కలు నాటడంతో పాటు ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావడంలో విశేష కృషి చేసిన, స్వచ్ఛందంగా పాల్గొన్న వలంటీర్లు, ఉద్యోగులను వారు ప్రత్యేకంగా అభినందించారు. డివిజన్ పరిధిలో పరిశుభ్రత, ప్రయాణికుల పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపర్చడంతో డివిజన్ అనుకున్న లక్షాలను సాధించినట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ డీఈ (పర్యావరణ, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్) వంశీకాంత్, పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ పాల్గొన్నారు.