
గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
నిమ్మకూరు(పామర్రు): గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించామన్నారు. ఇంకా గ్రామానికి అవసరమైన పనులను గ్రామస్తుల నుంచి తెలుసుకుని వాటి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో రహదారుల నిర్మాణం, అంతర్గత డ్రెయినేజీ, చెరువుల కంచె ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్పు, పీహెచ్‌సీలో పరికరాల ఏర్పాటు, వసతుల కల్పనపై చర్చించారు. గ్రామంలో కమ్యూనిటీ గోకులం ఏర్పాటుకు రూ.10 లక్షల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. అనంతరం గ్రామంలోని గురుకుల వృత్తి విద్యా పాఠశాల, బాలుర, బాలికల డార్మిటరీలను పరిశీలించారు. గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ.1.10 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నూతక్కి వెంకట సాంబశివరావు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ