
విద్యారంగ సమస్యల పరిష్కారానికి 22 నుంచి బస్సు జాతా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 22 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు బస్సు జాతా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందెల నాసర్‌జీ తెలిపారు. విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో బస్సు జాతా వాల్ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే చర్యలు మానుకోవాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువగళం పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే బకాయిలు పూర్తిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విద్యారంగ సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కురుపాంలో 150 మంది విద్యార్థులు వ్యాధుల బారిన పడ్డారని, వీరిలో నలుగురు విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, నాయకులు ప్రణీత్, అమర్నాథ్, అజయ్ పాల్గొన్నారు.