
నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
వించిపేట(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ షేక్ గౌస్‌మొహిద్దీన్ డిమాండ్ చేశారు. వించిపేటలోని తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పెద్దల అండదండలతో ఆ పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దనరావు ఒక పరిశ్రమలా పెద్దఎత్తున తయారు చేసిన నకిలీ మద్యం వ్యవహారంలో కుట్రపూరితంగా వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ఏడాదిన్నర టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని అమ్మి టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం బయటకు పడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటంతో దొంగే.. దొంగ అని అరిచిన చందంగా వైఎస్సార్ సీపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిమాండ్ రిపోర్టులో లేని జోగి రమేష్ పేరు ఇప్పడు ఎలా వచ్చిందని, ఇది కుట్ర పూర్వక చర్యలు కాదా అని గౌస్ మొహిద్దీన్ ప్రశ్నించారు. నిందితుడి చేతికి ఫోన్ ఇచ్చి జోగి రమేష్ పేరు చెప్పిస్తూ చవకబారు వీడియో చేశారని ఎద్దేవా చేశారు.
జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ గౌస్‌మొహిద్దీన్