
ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం లక్ష్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలకు విచ్చేసే ప్రతి భక్తుడికి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనం సంతృప్తికరంగా జరిగేలా చూడాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ఇంజినీ రింగ్, ఏఈవోలు, సూపరింటెండెంట్లతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ఆలయానికి చెందిన ముఖ్య అధికారులందరూ హాజరయ్యారు. దసరా ఉత్సవాలలో సిబ్బంది పని తీరు, సహనాన్ని ప్రతి ఒక్కరూ గమనించారని, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. అదే తీరులో రానున్న కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలలో భక్తులకు మరింత సేవలు అందించాలని సూచించారు. రానున్న ఉత్సవాలలో ఎక్కడ అలక్ష్యం జరిగినా సహించేది లేదన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
66 అంశాలపై చర్చ
సమీక్ష సమావేశంలో ఆలయంలో చేపట్టాల్సిన మార్పులు, అభివృద్ధి పనులకు సంబంధించి 66 అంశాలను గుర్తించి, వాటి గురించి చర్చించారు. కనకదుర్గనగర్‌లో దేవస్థానానికి చెందిన భవనాలను కాటేజీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అన్నదానం, లడ్డూ పోటు, క్యూ కాంప్లెక్స్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. కొండపై దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలను భక్తులందరికీ అందు బాటులో ఉండేలా కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయంలోకి మొబైల్ ఫోన్లతో భక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతరాలయంలోకి వచ్చే భక్తులు, ఆర్జిత సేవల్లో పాల్గొనే ఉభయదాతలందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో ఏసీ రంగారావు, ఈఈ రాంబాబు, ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు, సుధారాణి, గంగాధర్, తిరుమలేశ్వరరావు, శ్రీనివాస్, వైదిక కమిటీ సభ్యులు ఆంజనేయ ఘనాపాటి, శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
దుర్గ గుడి ఈవో శీనానాయక్
కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష