
18 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి జరగనున్న చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయాలని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెకుముకి సైన్స్ సంబరాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసీ్త్రయ సమాజం ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన జేవీవీ గత 35 ఏళ్లుగా తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఏటా చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోందన్నారు. సైన్స్ పట్ల ఆసక్తిని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ సంబరాలు ఉపయోగపడతాయన్నారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సంబరాలు నాలుగు స్థాయిల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 18న పాఠశాల స్థాయిలో, నవంబర్ 1న మండల స్థాయి, నవంబర్ 23న జిల్లా స్థాయి, డిసెంబర్ 12,13,14 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. ఈ సంబరాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యావంతులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి బోయి రవి, నాయకులు మురళీమోహన్, వెలగా శ్రీనివాస్, శోభన్ కుమార్, రాజశేఖర్, లెనిన్‌బాబు పాల్గొన్నారు.
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు