
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్‌లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్‌కు చెందిన మనోజ్ బిస్తా (26), రాకేష్ (34) పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్ తీసుకుని ఇద్దరూ అద్దెకు ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్‌ఐ రవీంద్రనాయక్ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్‌లోని సౌరన ప్రస్తకీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్‌లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్‌లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్ బార్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు నేపాల్ యువకులు మృతి

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం